calender_icon.png 6 August, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతా గప్‌చుప్!

20-07-2024 12:56:21 AM

‘లెక్క’ సరిపోయింది!

బోధన్‌లోని ఒక పరపతిగల మిల్లర్ ముందు అధికారుల దాసోహం

రూ.10-15 కోట్ల విలువైన ధాన్యం మాయమైనా.. ఉన్నట్టుగా తేల్చిన వైనం

మీడియాకు సమాచారం ఇవ్వకుండా రహస్యంగా తనిఖీ

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): అది నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఒక రైస్ మిల్లు. శుక్రవారం నాడు స్థానిక పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దారుతోపాటు విజిలెన్స్ అధికారులు తనిఖీలకు వచ్చారు. చివరికి అంతా లెక్కించిన తరువాత.. అబ్బే లెక్క సరిపోయిందంటూ తేల్చారు. జిల్లాస్థాయి అధికారికూడా లెక్క సరిపోయిందంటూ తేల్చడంతో రైసు మిల్లర్లు ముక్కున వేలేసుకున్నారు. అసలు విషయం ఏమిటంటే.. సదరు మిల్లులో కనీసం రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల విలువైన ధాన్యం మాయమయ్యిందని మొదటి నుంచి గట్టి నమ్మకంతో అటు అధికారులు.. ఇటు మిల్లర్లుకూడా ఉన్నారు. అలాంటి కనీసం ఒక్క బస్తా ధాన్యం కూడా మాయమవ్వకుండా, మొత్తం లెక్క సరిపోయిందంటూ అధికారులు లెక్క తేల్చడంతో.. ఎలాగోలా మేనేజ్ చేశారని అందరూ సర్దిపుచ్చుకున్నారు.

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో ఒక రైస్‌మిల్లు యజమానికి జిల్లాలోనే కాదు.. ఏకంగా రాష్ట, జాతీయ స్థాయిలోనూ మిల్లర్ల వ్యవహారాలను చక్కదిద్దుతారనే పేరుంది. మిల్లర్లకు ఎలాంటి ఆపద వచ్చినా.. ‘విష్ణు’చక్రంలా వారిని కాపాడుతారని విశ్వా సం ఉంది. వారికోసం జిల్లాలోనే కాదు.. రాష్ట్రస్థాయి అధికారులను కూడా చక్కబెట్ట డంతో ఆయన సిద్ధహస్తుడని రైసు మిల్లర్లు సైతం తెగ పొగుడుతారు. అలాంటిది ఏకంగా.. అదే ‘విష్ణు’చక్రంలా మిల్లర్ల వ్యవహారాలను తిప్పే మిల్లరుకు సంబంధించి న బినామీ రైస్ మిల్లులోనే తనిఖీలు చేస్తారా.. చేసి ఏమన్నా తీగ లాగగల రా అనే అనుమానం మొదటి నుంచి ఉంది. అయితే వారి అనుమానం నిజమైంది.

అధికారులు ఎంత పకడ్బందీగా తనిఖీలు చేసినా.. చివరికి అంతా లెక్కలు సరిపోయాయంటూ తేల్చడంతో.. మొత్తానికి ఎలాంటి ‘అపవాదు’రాకుండా.. సదరు రైస్‌మిల్లర్ ‘విష్ణు’చక్రంలా అడ్డుపడ్డాడని రైసు మిల్లర్లే చెప్పుకుంటున్నారు. అందుకే.. ఎలా మేనేజ్ చేశారబ్బా, అంటూ ఆశ్చర్యపోతున్నారు. దీనికితోడు.. అధికారుల వ్యవహారం కూడా ఇందుకు అనుకూలంగానే కనపడుతోంది. రైస్ మిల్లు తనిఖీ సందర్భంగా ఎవరినీ.. మీడియా వారినికూడా మిల్లులోకి రానీయలేదు. పైగా తనిఖీ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచారు. చివరికి జిల్లా స్థాయి అధికారితో అంతా సరిపోయిందంటూ చెప్పించారు.

అయితే ఈ ‘లెక్కలు సరిపోవడం’ గురించిన అంకెలు మాత్రం చెప్పకుండా దాచిపెట్టడం గమనార్హం. అంటే ఎలాగోలా మేనేజ్ చేశారన్నదే నిజమనే అనుమానం కూడా వ్యక్తమవుతున్నది. మొత్తంగా చూసుకుంటే.. సుమారు రూ. 10 నుంచి రూ. 15 కోట్ల ధాన్యం మాయమయ్యిందనే సమాచారాన్ని జిల్లా స్థాయి అధికారి చెబుతారనుకుంటే.. ఏకంగా సరిపోయిందంటూ సరిపుచ్చడంతో మీడియా ప్రతినిధులుకూడా నోరెళ్ళబెట్టారు. లెక్కలన్నీ సరిపోతే.. మరి మీడియాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు.. అంకెలను ఎందుకు చెప్పడం లేదు అనే ప్రశ్నలకు సమాధానం రావడం లేదు. మీడియా సమక్షంలో మరోసారి తనిఖీలు చేయగలరా.. అంటే మౌనమే సమాధానంగా వస్తోంది. అంటే మేనేజ్ చేసినట్టే కదా.. అనే అనుమానం మరింత బలపడుతోంది..!