calender_icon.png 6 August, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కిల్ వర్సిటీకి రంగం సిద్ధం!

20-07-2024 12:54:44 AM

  1. బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టేందుకు చర్యలు
  2. 17 కోర్సులు, ఏటా 20 వేల మందికి శిక్షణ
  3. అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్యాల శిక్షణను అందించి ఉద్యోగావకాశాలు కల్పించే సమున్నత లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ వర్సిటీని ఏర్పాటు చేస్తుందన్నారు.

దీని ఏర్పాటు, నిర్వహణకు ఎంత ఖర్చు అయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీపై సచివాలయంలో శుక్రవారం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్కతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ, హర్యానాలో ఉన్న స్కిల్ యూనివర్సిటీలను పరిశీలించి తెలంగాణలో ఏర్పాటుకు రాష్ర్ట పరిశ్రమల విభాగం నమూనా ముసాయిదాను తయారు చేసింది. ఈ యూనివర్సిటీలో నిర్వహించే కోర్సులు, వాటి వ్యవధి, నిర్వహణకు అవసరమయ్యే మౌలిక వసతులు, నిర్వహణకు అవసరమయ్యే నిధులు, వివిధ కంపెనీల భాగస్వామ్యంపై పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ప్రదర్శించారు. కొత్త యూనివర్సిటీకి ‘తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ’ అని పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.  

పీపీపీ మోడల్‌లో...

ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో (పీపీపీ) స్కిల్స్ యూనివర్సిటీ నెలకొల్పుతారు. లాభాపేక్ష లేకుండా స్వయంప్రతిపత్తి ఉండేలా దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మూడునాలుగేండ్ల కాల వ్యవధి ఉండే డిగ్రీ కోర్సులతో పాటు ఏడాది డిప్లొమా, మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఉండే సర్టిఫికెట్ కోర్సులు ఇందులో నిర్వహిస్తారు. తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న వివిధ రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ఎంపిక చేశారు. మొత్తం 17 ప్రాధాన్య రంగాలను గుర్తించారు. ఫార్మా, కన్‌స్ట్రక్షన్, బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్ రంగాలను ఎంపిక చేశారు. తొలుత ఆరు రంగాల్లో ఉపాధి అవకాశాలున్న కోర్సులను ప్రవేశపెడుతారు. ప్రతి కోర్సును సంబంధిత రంగంలో పేరొందిన ఒక కంపెనీ భాగస్వామ్యం ఉండేలా అనుసంధానం చేస్తారు. అందుకు సంబంధించి ప్రభుత్వం కంపెనీలతో ఎంవోయూ చేసుకుంటుంది. తొలి ఏడాది రెండు వేల మందితో ప్రారంభించి, క్రమంగా ఏడాదికి 20 వేల మందికి ఈ కోర్సుల్లో అడ్మిషన్లను కల్పించనున్నారు. 

హైదరాబాద్‌లోనే మెయిన్ క్యాంపస్ 

హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ క్యాంపస్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో ప్రాంతీయ ప్రాంగణాలు ఏర్పాటు చేయాలనే చర్చ జరగింది. అందరూ హైదరాబాద్ క్యాంపస్‌లో చేరేందుకు పోటీ పడుతారని సీఎం అన్నారు. అందుకే హైదరాబాద్‌లోనే అందరికీ శిక్షణను అందించేలా ఏర్పాట్లు చేయాలని, న్యాక్ క్యాంపస్ ఉపయోగించుకోవాలని, అవసరమైన మౌలిక వసతి సదుపాయాలుండే వివిధ ప్రాంగణాలను గుర్తించాలని సూచించారు. భూదాన్ పోచంపల్లిలో ఉన్న స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న సదుపాయాలను అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించాలని సీఎం ఆదేశించారు. 

ఉద్యోగావకాశాలు లభించేలా.. 

రాష్ర్టంలో ఫార్మా కంపెనీల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నందున అటువంటి కోర్సుల్లో ఎక్కువ సీట్లు ఉండాలని చెప్పారు. ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు ఉండాలని ఆదేశించారు. మిగతా యూనివర్సిటీలు అనుసరించిన విధానాలను పరిశీలించి కొత్త యూనివర్సిటీ సంస్థాగత నిర్మాణాన్ని తయారుచేయాలని సూచించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు,  తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పలు మార్పులు చేర్పులు చేసి ముసాయిదాను సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

ప్రభుత్వ ఆస్తుల రక్షణే లక్ష్యంగా హైడ్రా

  1. హైడ్రాను ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు
  2. విధివిధానాలను ప్రకటించిన సీఎస్ శాంతికుమారి
  3. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్?

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. ఐటీ, ఫార్మా, బయో టెక్నాలజీ హబ్‌గా దేశానికి సేవలందిస్తోంది. రియల్‌ఎస్టేట్ సైతం భారీగా విస్తరిస్తోంది. మరోవైపు ఓఆర్‌ఆర్‌తో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుండగా ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు రానుంది. ఇక అనేక కొత్త ప్రాజెక్టులూ హైదరాబాద్‌కు వస్తున్నాయి. దీంతో ఊహించని విధంగా హైదరాబాద్ బ్రాండ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఎంతో విలువైన ప్రభుత్వ ఆస్తులపై అక్రమార్కుల దృష్టి పడుతోంది.

రాష్ర్ట రాజధాని హైదరాబాద్‌లో ప్రభుత్వానికి ఎంతో విలువైన స్థలాలు, ఆస్తులున్నాయి. రూ.కోట్ల విలువైన ఈ స్థలాలు, ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ సర్కారు సిద్ధమైంది. అందుకోసం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ను చట్టబద్ధంగా ఏర్పాటు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి విధివిధానాలపై ఉత్తర్వులు ఇచ్చారు.

భారీ బృందంతో 

జీహెచ్‌ఎంసీ పరిధితో పాటు ఓఆర్‌ఆర్ వరకు హైడ్రా పరిధి విస్తరించి ఉంటుందని ప్ర భుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి చైర్మన్‌గా, పురపాలకశాఖ మంత్రి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జీహెచ్‌ఎంసీ మేయర్, రెవెన్యూ, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శులు, డిజాస్టర్ రెస్పా న్స్ డీజీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఎండీ హెచ్‌ఎండీఎ, ఎండీ టీజీఎస్పీడీసీఎల్, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ, పోలీస్ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్, సబ్‌కమిటీ నామినేట్ చేసిన సభ్యులు, కమాండ్ కంట్రోల్ సెంటర్ హెడ్ హైడ్రాలో సభ్యులుగా, హైడ్రా కమిషనర్ కన్వీనర్‌గా ఈ ఏజెన్సీ పనిచేస్తుందని ప్రభుత్వం ఉత్త ర్వుల్లో వెల్లడించింది. హైడ్రాకు ప్రత్యేక బడ్జెట్ తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు. 

ఆక్రమణలకు చెక్ 

ఆక్రమణలను తొలగించడం పార్కులు, లే అవుట్లు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ ఆస్తుల రక్షించడం, బహిరంగ ప్రదేశాలు, ఆట స్థలాలు, చెరువులు, నాలాలు, రహదారులు ఆక్రమణలకు గురికాకుండా అడ్డుకోవడంతో పాటు కాజ్‌వేలు, ఫుట్ పాత్, డ్రైనేజీలు, నాలాలు, రోడ్లు, భవనాలు, ఆస్తులు మొదలైనవి ఆక్రమిస్తే జీహెచ్‌ఎంసీ సమన్వయంతో వాటిని తొలగించడం హైడ్రా పని. డీఆర్‌ఎఫ్ బృం దాల సహకారంతో అత్యవసర వేళల్లో సహాయ క చర్యలు కొనసాగించడం వంటి బాధ్యతలను సైతం హైడ్రా నిర్వహించనుంది. ప్రజలకు నిరంతరం సేవలు అందించేలా హైడ్రా పనిచేస్తుంది. ట్రాఫిక్ పోలీసులతో కలిసి ట్రాఫిక్ నిర్వహణపైనా హైడ్రా దృష్టిపెడుతుంది. 

హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్?

ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్‌గా నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్‌గా ఉన్న ఆయనను హైడ్రాకు బాధ్యతలను కూడా అప్పగిస్తే రెండింటినీ సమన్వయంతో నిర్వహిస్తారని సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.