calender_icon.png 3 July, 2025 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాశమైలారం ఘటనపై నిపుణుల కమిటీ

03-07-2025 01:13:04 AM

  1. నలుగురు సభ్యులతో ఏర్పాటు
  2. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీలో జరిగిన పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ తమ సూచనలు, సిఫార్సులను నెల రోజుల్లో ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

సీఎస్‌ఐఆర్ శాస్త్రవేత్త వెంకటేశ్వర రావు అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. దీనిలో సభ్యులుగా చీఫ్ సైంటిస్ట్ ప్రతాప్ కుమార్, రిటైర్డ్ సైంటిస్ట్ సూర్యనారాయణ, పుణెకు చెందిన భద్రతా అధికారి సంతోష్ ఘుగేలు కమిటీలో ఉన్నారు. ఈ మేరకు కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఉత్తర్వలు జారీ చేశారు.

ఈ కమిటీ సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదానికి దారి తీసిన కారణాలను గుర్తించడం, కార్మికుల భద్రత కోసం తీసుకున్న చర్యలు, యాజమాన్యాలు అనుసరించాల్సిన జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తున్నాయా లేక నిబంధనను కంపెనీ ఉల్లంఘించిందా అనే అంశాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

కంపెనీ యాజమాన్యం, సిబ్బంది, కార్మికుల నుంచి వివరాలు సేకరించనున్నది. కెమికల్, ఫార్మా పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా భవిష్యత్‌లో నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలను కమిటీ సిఫార్సు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. కమిటీకి డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సహకారం అందించాలని ఆదేశించింది.