calender_icon.png 4 July, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడి బాట పట్టిన కలెక్టర్లు

03-07-2025 05:18:37 PM

మహబూబాబాద్/జయశంకర్ భూపాలపల్లి (విజయక్రాంతి): మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్లు గురువారం బడిబాట పట్టారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) జిల్లాలోని బ్రాహ్మణపల్లి, కొమ్ముగూడెం ప్రభుత్వ పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. తరగతి గదులకు వెళ్లి వివిధ పాఠ్యాంశాలపై విద్యార్థులను ప్రశ్నలు అడిగి విద్యా బోధన తీరును తెలుసుకున్నారు. అలాగే మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం వంట రుచి చూశారు. తరగతి గదులను, ఆవరణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కొమ్ముగూడెం పాఠశాలలో పర్యావరణ పరిరక్షణకు గుర్తుగా కలెక్టర్ మొక్క నాటారు. 

భూపాలపల్లిలో..

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) జిల్లాలోని ఎస్. ఎన్ కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి విద్యా బోధన తీరు, పాఠశాల నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు వివిధ పాఠ్యాంశాలను పూర్తిగా అవగతమయ్యేలా విద్యాబోధన చేయాలని, సబ్జెక్టుల్లో వెనుకబడ్డ విద్యార్థులకు కొంత సమయం కేటాయించి సామర్థ్యాలు మెరుగయ్యే విధంగా కృషి చేయాలని, చదువు పట్ల ఆసక్తి పెంపొందించే విధంగా విద్యాబోధన చేయాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచే విధంగా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాలలో చేరిన 5వ తరగతి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల తీరు ఎలా ఉందని ప్రశ్నించగా విద్యాబోధన చక్కగా ఉందని చెప్పడంతో అభినందించారు. అంగన్వాడీ కేంద్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సక్రమంగా అమలు చేసి, బాలింతలు, గర్భిణీలు, చంటి పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆయా కార్యక్రమంలో డిఈఓ లు డాక్టర్ రవీందర్ రెడ్డి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.