26-08-2025 01:33:16 AM
హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): తెలంగాణలో జరుగనున్న స్థాని క సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. సోమవారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. బీసీ కోటా అంశంపై సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీ లోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిందని, ఈ నేపథ్యంలోనే ఎన్నికల ముందు ఇచ్చిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డితోనూ భేటీ అవుతామని వెల్లడించారు. ఈ నెల 29న జరిగే క్యాబినెట్ సమావేశంలో తమ నివేదికను క్యాబినెట్ ముందు పెడతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కోశాధికారి అజయ్ మాకెన్ పాల్గొన్నారు.
సుప్రీం కేసుల్లో ఇంప్లీడ్ అయ్యే యోచన..
42 శాతం బీసీ కోటా సాధన కోసం రాష్ట్రప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. దీనిలో భాగంగానే గతంలో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసులో ఇంప్లీడ్ కానున్నదని సమాచారం. రాష్ట్రపతి, గవర్నర్‌కు పంపిన బిల్లుల ఆమోదంపై రాజ్యాంగ బద్ధతపై సవాల్ చేస్తూ తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరుపుతున్నది. ఆరు నెలల క్రితం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది.
ఆ బిల్లలను గరవ్నర్ వద్దకు పంపించగా, గవర్నర్ వాటిని రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. అక్కడ బీసీ బిల్లు పెండింగ్‌లో ఉండడంతోనే తెలంగాణ ప్రభు త్వం ఇక తమిళనాడు, కేరళ కేసుల్లో ఇంప్లీడ్ కావాలని భావిస్తున్నది. ఈ మేరకు సుప్రీంకోర్టు ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించనున్నది. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఆ దిశగా అడుగులు వేసేందుకే న్యాయ నిపుణులతో చర్చించినట్టు తెలుస్తున్నది.