19-09-2025 07:21:30 PM
జగిత్యాల అర్బన్,(విజయక్రాంతి): రానున్న బతుకమ్మ పండగ, దసరా నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా పట్టణంలో ఏర్పాట్లు చేయాలని కోరుతూ శుక్రవారం బీజేపీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్ మాట్లాడుతూ... హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే బతుకమ్మ, దసరా నవరాత్రుల ఉత్సవాలలో పట్టణంలో కనీస సౌకర్యాలు కల్పించకుండా హిందువులను చిన్నచూపు చూడడం బాధాకరం అన్నారు.
జగిత్యాల పట్టణంలో పలు చోట్ల దుర్గామాత విగ్రహాలను ప్రతిష్టించే ప్రదేశాలలో రోడ్లు ధ్వంసం అయి గుంతలు ఏర్పడ్డాయని, వాటిని వెంటనే మరమ్మతులు చేసి పూడ్చాలని కోరారు. పట్టణంలో అన్ని అమ్మవారి మండపాల వద్ద పారిశుధ్యం చాలా అధ్వాన్నంగా ఉందని, వీధిదీపాలు కూడా సరిగా పనిచేయడం లేదన్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగా పట్టణ ప్రధాన కూడళ్లలో కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, టవర్ సర్కిల్, తహసిల్ చౌరస్తాల వద్ద లైటింగ్ ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్నారు. అధికారులు స్పందించి సకాలంలో ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.