19-09-2025 08:11:18 PM
హనుమకొండ,(విజయక్రాంతి): బీసీలపై అగ్రవర్ణ రాజకీయ పార్టీల వైఖరి మారకుంటే దేశంలో మరో స్వాతంత్ర్య పోరాటమే లక్ష్యంగా పోరాడేందుకు పార్టీలకతీతంగా, జెండాలకతీతంగా, కులాలకతీతంగా, బీసీ ఎజెండాతో బీసీ కుల సంఘాలన్నింటిని ఏకతాటిపైకి తీసుకొచ్చి అగ్రవర్ణ పార్టీల భరతం పడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం హన్మకొండలోని ఫాతిమా నగర్ లో గల వైష్ణవి గ్రాండ్ హోటల్ లో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర రాజకీయ మేధో మదన రాష్ట్ర స్థాయి సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు భైరీ రవికృష్ణ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... శుక్రవారం వరంగల్ వేదికగా జరుగుతున్న ఈ రాజకీయ మేధో మదన రాష్ట్ర స్థాయి సమావేశంలో తీసుకున్న అంశాలపై చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించినందుకు రాష్ట్ర కమిటీని ఆయన అభినందించారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీలో చేసిన బిల్లులను రాష్ట్రపతి, అలాగే అసెంబ్లీలో చేసిన చట్టాన్ని రాష్ట్ర గవర్నర్ తక్షణమే ఆమోదించి బీసీలకు తగిన న్యాయం చేయాలని, బీసీ రిజర్వేషన్లను తమిళనాడు రాష్ట్ర తరహాలో పెంచడానికి 9వ షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వం వెంటనే చేర్చాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను పెంచకుండా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ను, రాష్ట్రంలో రాజ్ భవన్ ను ప్రభావితం చేస్తూ బీసీలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, బీసీలపై బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న బీసీ రిజర్వేషన్ల బిల్లులను చట్ట రూపంలో తీసుకురావాలని కోరారు. బీసీ రిజర్వేషన్లను పెంచకుండా,బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కకుండా అగ్రవర్ణ పార్టీలు చేస్తున్న కుట్రలను ఎండగడుతూ బీసీ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి నవంబర్ 9న భువనగిరిలో లక్షలాది మంది బీసీ సైనికులతో బీసీల రాజకీయ యుద్ధభేరి మహాసభను నిర్వహించి అగ్రవర్ణ పార్టీల కుట్రలను ఎండగడతామని హెచ్చరించారు. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎత్తివేయాలని, లేకుంటే బిజెపికి వ్యతిరేకంగా బీహార్ ఎన్నికలలో బీసీలమంతా ప్రచారం నిర్వహించి,బిజెపి కుట్రలను చిత్తు చేస్తామన్నారు.
స్వాతంత్ర్యం సిద్ధించి 79 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడం మూలంగా బీసీలు అన్ని విధాలుగా నష్టపోతున్నారని, వెంటనే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, చట్టసభలలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా, బీసీ క్రిమిలేయర్ రద్దు, ఉన్నత న్యాయస్థానాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, ప్రైవేట్ రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కల్పించడానికి దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఉదృతం చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పోస్టులలో బీసీలకు అన్యాయం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వానికి 42 శాతం రిజర్వేషన్ల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సమాచార కమీషనర్లు, ప్రభుత్వ సలహాదారులు, రాష్ట్ర మంత్రి వర్గంలో బీసీల జనాభా ప్రాతిపాదికన మంత్రులు, క్యాబినెట్ చైర్మన్ లు, సీఎం పేసి నుండి మొదలుకొని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, ప్రభుత్వ సెక్రెటరీలలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం వాటా కల్పించాల్సిందేనన్నారు. బీసీల పోరాటాన్ని రాజకీయ పోరాటంగా ముందుకు తీసుకెళ్ళేందుకు బీసీ మేధావుల సూచనలను, సలహాలను పరిగణలోకి తీసుకుని నవంబర్ 9న నిర్వహించబోయే భువనగిరి సభా వేదికగా రాజకీయ భవిష్యత్ ఎజెండాను ప్రకటిస్తామని తెలిపారు.ఈ సమావేశానికి ఓబిసి కమిటీ సభ్యులు సంఘం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్, గడ్డం భాస్కర్, వేణుమాధవ్ గౌడ్ తదితరులు సంఘీభావం ప్రకటించారు.