15-10-2025 12:02:47 AM
రాచకొండ సీపీకి ఫిర్యాదు
హైదరాబాద్, అక్టోబర్ 14(విజయక్రాంతి): అవినీతి ఆరోపణలు, పలు వివాదాలతో తరచూ వార్తల్లో నిలిచే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో ఇప్పుడు ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అండర్ 16, అండర్ 19, అండర్ 23 లీగ్ మ్యాచ్‌లలో ఈ నకిలీ బర్త్ సర్టిఫికెట్లు వెలుగుచూసినట్టు తెలుస్తోంది. ఎక్కువ వయసున్న ప్లేయర్లు నకిలీ ధృవపత్రాలతో హెచ్‌సీఏ లీగ్ మ్యాచ్‌లలో ఆడినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఇటీవల వినూ మన్కడ్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో పలువురి ఎంపిక ఇలాగే జరిగిందని ఆరోపిస్తూ అనంత్‌రెడ్డి అనే వ్యక్తి రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. గతంలో ఇలాంటి వ్యవహారమే వెలుగుచూసినప్పుడు బీసీసీఐ ఆరుగురు ప్లేయర్లపై నిషేధం విధించిన విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినప్పటకీ హెచ్‌సీఏ తీరు మార్చుకోకుండా ఎక్కువ వయసున్న ఆటగాళ్ళను తక్కువ వయసు విభాగంలో ఆడేందుకు అనుమతిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో టాలెంట్ ఉన్న ప్లేయర్స్ కు అన్యాయం జరుగుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీకి ఫిర్యాదు చేశారు. గత కొన్నాళ్ళుగా పలు అంశాల్లో అవినీతి ఆరోపణలు కారణంగా హెచ్‌సీఏపై తీవ్ర విమర్శలు వచ్చాయి.