calender_icon.png 13 September, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయిరాం ఆసుపత్రిపై తప్పుడు ప్రచారం

13-09-2025 01:36:43 AM

  1. రోగుల శ్రేయస్సే మా ప్రధాన కర్తవ్యం
  2. ఆసుపత్రి అధినేత డాక్టర్ జంగాల సునీల్ కుమార్

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలోని సాయిరాం ఆసుపత్రిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని తాము ఖండిస్తున్నామని, రోగుల శ్రేయస్సే తమ ఆసుపత్రి ప్రధాన కర్తవ్యం అని, నాటువైద్యం (పసరు), మూఢనమ్మకాలు నమ్మవద్దని ఆసుపత్రి అధినేత డాక్టర్ జంగాల సునీల్ కుమార్ అన్నారు. జంగాల రాజేశ్వర్‌రావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ద్వారా గత 8 సంవత్సరాలుగా హెపటైటిస్-బి టీకా ఉచితంగా అందరికీ అందిస్తున్నామని చెప్పారు.

శుక్రవారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సాయిరాం ఆసుపత్రి అధినేత డాక్టర్ జంగాల సునీల్ కుమార్ మాట్లాడుతూ.. “మా ఆసుపత్రి గురించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న  తప్పును ఖండిస్తున్నామని తెలిపారు. ఇటీవల మా ఆసుపత్రిలో చికిత్స పొందిన 13 ఏళ్ల బాలుడు కాలేయం క్షీణత (సిరోసిస్) వ్యాధి సమస్యలతో ప్రాణాపాయస్థితిలో ఉండి మా ఆసుపత్రికి తీసుకురాగా, గ్యారంటీ లేదు, గవర్నమెంట్ ఆసుపత్రిలో చేరాలని చెప్పాము. మీ ప్రయత్నం మీరు చెయ్యండి.

మీ హాస్పిటల్‌లో చేర్చుకొమ్మని బాలుడు తల్లిదండ్రులు ప్రాధేయపడితేనే వైద్యం చేయడానికి అంగీకరించాను. ఆ బాలుడు అంతకు ముందు నాటువైద్య మందులు(పసరు) వాడినట్లు, అనంతరం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో కాలేయ పరీక్షలు బయాప్సీ చేయించుకున్నట్లు, హైదరాబాద్‌లో కాలేయ మార్పిడి చేయాలని సూచించారని, ఆ తర్వాత మళ్లీ నాటువైద్యం వాడటంతో మూత్రపిండాల వైఫల్యంతో పాటు కాలేయం పనితీరు దెబ్బతిని మెదడుకు ప్రభావం చూపే వ్యాధి (ఎన్సెఫలోపతి) సమస్యలు తలెత్తాయని వివరించారు.

తీవ్రప్రాణాపాయస్థితిలో ఉన్న ఆ బాలుడిని మరలా నాలుగు రోజులు ఆలయంలో ఉంచి, చివరి ప్రయత్నంగా తమ ఆసుపత్రికి తీసుకువచ్చారని, బాబు పరిస్థితి అప్పటికే చెయ్యి దాటిపోయిందని తెలిపారు. రోగి పరిస్థితి గురించి ఆయన బంధువులకు స్పష్టంగా వివరించామని, తల్లి దండ్రుల అంగీకారంతోనే మా ప్రయత్నంగా చికిత్స అందించామని అన్నారు. వైద్యం అందించే సమయంలో తల్లి దండ్రులు, బంధువులను కూడా నేరుగా చికిత్స విభాగంలోకి అనుమతించి, రోగి పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరించామని, రోగి చేతులు, కాళ్లు కదుపుతున్న దృశ్యాలను వీడియోలను మీడియాకు చూపించారు.

ఈ విషయంపై సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు ప్రచారం కారణంగా ప్రజల్లో అనవసరమైన అపోహలు కలుగుతున్నాయని, మా ఆసుపత్రి ఎల్లప్పుడూ ప్రభుత్వ మార్గదర్శకాలు, వైద్య నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా, నమ్మకమైన వైద్య సేవలు అందిస్తోంది” అని డాక్టర్ జంగాల సునీల్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్, డాక్టర్ బోల్లికొండ శ్రీనివాసరావు, డాక్టర్ జంగాల స్వాతి, డాక్టర్ సురీందర్‌రెడ్డి, డాక్టర్ నారాయణ, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ రవి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.