calender_icon.png 31 August, 2025 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏరియల్ సర్వే కాదు క్షేత్రస్థాయిలో సీఎం పర్యటించాలి: మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

30-08-2025 09:20:53 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయడం కాదని.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే రైతుల కష్టాలు తెలుస్తాయని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా తీవ్రస్థాయిలో పంట నష్టం జరిగిందని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం ఎల్లారెడ్డి మండలంలో పర్యటించి భారీ వరదల కారణంగా దెబ్బతిన పంటలను, రహదారులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ… వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా పర్యటించకుండా హెలిక్యాప్టర్ ద్వారా ఏరియాల్ సర్వే చేస్తే రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు.

భారీ వర్షాలు కురిసి నాలుగు రోజులు గడిచిన ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి రాలేదని, సంబంధిత అధికారులు సైతం పత్తా లేరని మండిపడ్డారు. నియోజకవర్గంలోని అనేక చెరువులు తెగిపోయాయని, పోచారం ప్రాజెక్టులకు సైతం గండి పడిన పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ వరదల కారణంగా రైతులు అపారంగ నష్టపోయారని, వారి పంట పొలాల్లో ఇసుక దిబ్బలు, రాళ్లు రప్పలు వచ్చి పడటంతో అపార నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్ష రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇళ్ళు కూలిపోయిన వారికి తక్షణమే ఆర్ధికసాయం చెయ్యాలన్నారు. పదిరోజుల్లో ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే రైతాంగంతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.