05-09-2025 12:26:47 AM
కామారెడ్డి, సెప్టెంబర్ 4 (విజయ క్రాంతి)ః కామారెడ్డి జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో విండోల వద్ద యూరియా బస్తాల కోసం క్యూలైన్లు, తోపులాటలతో రైతులు సతమతమవుతున్నారు. ఒక రైతుకు ఒక యూరియా బస్తా ఇస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకున్న భూమికి ఏమాత్రం సరిపోదని రైతులు ఆరోపిస్తున్నారు.
ఎన్ని ఎకరాలు ఉంటే ఎకరాకు రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గురువారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్ లో విండో వద్ద అధికారులు రాకపోవడంతో క్యూ లైన్ లో చెప్పులు పెట్టి విండో ఆవరణలో రైతులు నిరీక్షించారు. ఒక యూరియా బస్తా ఒక రైతుకు ఏమాత్రం సరిపోదని రైతులు వాపోతున్నారు. ఇచ్చే యూరియా బస్తాలను పాస్ బుక్ ఆధారంగా చేసుకొని పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు.
రాజంపేట, భిక్కనూర్, తాడువాయి, లింగంపేట్, సదాశివ నగర్, రామారెడ్డి, మండల కేంద్రాల్లో రైతులు యూరియా బస్తాల కోసం అవస్థలు పడుతున్నారు. అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. స్టాకు లేకపోవడం వల్లే రైతులకు ఒక యూరియా బస్తాలు అందజేస్తున్నట్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధికారులు చెప్తున్నారు. కామారెడ్డి జిల్లాలో యూరియా కష్టాలు తీరడం లేదని రైతులు పేర్కొంటున్నారు.
జిల్లాలోని ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్చార్జి మంత్రి, స్పందించి జిల్లాకు కావలసిన యూరియాను రప్పించాలని రైతులు కోరుతున్నారు. రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని అంటున్నారు. తెల్లవారుజామున వచ్చి యూరియా బస్తా కోసం క్యూ లైన్ లో నిలబడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. యూరియా కష్టాలు జిల్లా రైతులకు ఎప్పుడు తీరుతాయో అధికారులకి తెలియాలి మరి.