13-08-2025 10:19:28 PM
నంగునూరు: కరెంట్ కష్టాలతో అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా(Siddipet District) నంగునూరు మండలం గట్లమల్యాల (సీతారాంపల్లి)లో గత 15 రోజుల్లో రెండు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడంతో పంటలకు నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. నంగునూరు మండలంలోని పలు గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యత లేని కరెంట్ సరఫరా చేస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు.
నాణ్యత లేని విద్యుత్ కారణంగా తమ మోటార్లు కాలిపోతున్నాయని, దీంతో ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి సమస్యలు లేవని, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం వంటి సంఘటనలు జరగలేదని రైతులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పాత రోజులు తీసుకొచ్చిందని, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయిన తర్వాత అధికారులు సకాలంలో స్పందించకపోవడం వల్ల తమ పంటలకు నీరు అందక తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.