calender_icon.png 12 September, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

11-09-2025 08:01:08 PM

పట్టించుకోని అధికార యంత్రాంగం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లో రైతుల ఆందోళన 

కామారెడ్డి (విజయక్రాంతి): యూరియా రైతులకు అందడం లేదు. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట రోడ్డు ఎక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి రైతులకు దాపురించింది. అధికారులు మాత్రం మోద్దు నిద్ర విడడం లేదు. కనీసం ప్రజాప్రతినిధులు సైతం రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో యూరియా కోసం రైతులు గురువారం రోడ్డెక్కి నిరసన తెలిపారు. రైతులకు అవసరమైన యూరియా అందించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో రైతులకు యూరియా కొరత వేధిస్తుంది. ఎక్కడో ఒకచోట యూరియా కోసం ఆందోళనలు కొనసాగడమే కాకుండా క్యూ లైన్ లలో చెప్పులు పెట్టి ఎదురుచూస్తున్నారు.

కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం రైతన్నలు రోడ్డు ఎక్కుతున సంఘటనలు రోజుకో మండలంలో ఎక్కడో ఒకచోట చోటు చేసుకుంటూనే ఉన్నా సరిపడా యూరియా సరఫరా చేయడంలో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు విఫలమయ్యారు. తాజాగా గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి యూరియా కోసం క్యూ లైన్ లో నిలుచున్న రైతులు సరిపడా యూరియా లేదని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిరిసిల్ల- కామారెడ్డి రోడ్డుపై గంజి గేటుకు ఎదురుగా బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పంటలకు  అవసరమైన యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వహిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

టోకెన్లు ఇచ్చి పంపించిన అధికారులు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో 200 బ్యాగుల యూరియా ఉండగా అంతకు రెట్టింపు మంది రైతులు యూరియా కోసం వచ్చి క్యూ లైన్ లో నిల్చున్నారు. దీంతో ఇక్కడున్న యూరియా ఎవరికి సరిపోదని గ్రహించిన అధికారులు మళ్లీ రేపు కూడా యూరియా లోడ్ వస్తుందని, ఇప్పుడున్న యూరియాతో పాటు రేపు వచ్చే యూరియాకు కూడా కలిపి టోకెన్లు ఇస్తామని రైతులను సర్ది చెప్పి టోకెన్లు ఇచ్చి పంపించి వేశారు. కాగా ఈ విషయమై మండల వ్యవసాయాధికారి పవన్ కుమార్ మాట్లాడుతూ.. కామారెడ్డి మండలంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల రైతులు తరలి రావడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది అన్నారు. రైతులందరికి సరిపడా యూరియా అందజేస్తామన్నారు. రామారెడ్డి, మాచారెడ్డి, రాజంపేట, పాల్వంచ, మండలాల్లో సైతం యూరియా కోసం రైతులు విండో కార్యాలయాల వద్ద అడిగాపులు కాస్తున్నారు. క్యూలైన్లో బారులు తీరిన యూరియా మాత్రం రైతులకు ఒక బస్తాను మాత్రమే అందజేస్తున్నారు. దీంతో రైతులు ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాసిన ఒక యూరియా   బస్తా మాత్రమే అందిస్తుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతులకు సరిపడా యూరియా సరాపర చేస్తాం 

మోహన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి, కామారెడ్డి 

కామారెడ్డి జిల్లాలో యూరియా కొరత ఉందని, రైతులకు సరిపడా యూరియా లో సరఫరా చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి విజయక్రాంతి ప్రతినిధితో తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని త్వరలోనే సరిపడ యూరియా రైతులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఒకేసారి రైతులు రావడంతో యూరియా పంపిణీ చేయడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. రైతులకు పాసుబుక్ ప్రకారం టోకెన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులు సమన్వయం పాటించి టోకెన్ల పద్ధతిలో యూరియా బస్తాలను తీసుకెళ్లాలని రైతులకు సూచించారు.