calender_icon.png 12 September, 2025 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం త్వరగా పూర్తి చేయాలి

11-09-2025 09:59:35 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి (విజయక్రాంతి): భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh ​​Surabhi) ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ తో కలిసి తహసీల్దార్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇవే కాకుండా భూ భారతి సాధారణ దరఖాస్తులపై కూడా దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 12, 2020 నుండి నవంబర్ 10, 2020 వరకు వచ్చిన సాదా బైనామాలను మాత్రమే నిబంధనల ప్రకారం రెగ్యులరైస్ చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా భూభారతి నిబంధనలను అమలు చేయాలని సూచించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ లు ఆలస్యం అవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, అధికారులు బాధ్యతగా వ్యవహరించి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఎవరైనా అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, సూపర్డెంట్లు సునీత, మదన్ తహసిల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.