11-09-2025 10:05:41 PM
ఇంటిగ్రేటెడ్ కోర్టు శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తాం
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. జిల్లాలో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ కోర్టు భవనానికి శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తామన్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో 35 లక్షలతో నిర్మించనున్న పార్కింగ్ షెడ్ నిర్మాణపు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ కోర్టు భవనానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. విజన్ 2047 తో పనిచేస్తున్నామని, రానున్న 20 సంవత్సరాల కాలంలో నగరంలో కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. గత పది సంవత్సరాల కాలం మన మహబూబ్ నగర్ పూర్తిగా అభివృద్ధికి దూరంగా ఉందన్నారు.
మహబూబ్ నగర్ ను ప్రధానంగా ఎడ్యుకేషనల్ హబ్ గా, మెడికల్ హబ్ గా, ట్రాన్స్ పోర్ట్ హబ్ గా అభివృద్ధి చేయుటకు తాను కృషి చేస్తున్నానని చెప్పారు. ఎమ్మెల్యేగా తాను గెలిచిన తర్వాత మూడు ఇంజనీరింగ్ కళాశాలలను మహబూబ్ నగర్ కు తీసుకురావడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అందులో ఒకటి ఐఐఐటి కళాశాల అని అన్నారు. రాబోయే 10 సంవత్సరాల కాలంలో సుమారు 10 వేల మంది ఇంజనీర్లను కేవలం మన జిల్లా నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందుతారని ఆయన గుర్తు చేశారు. అందుకే ఎక్కడైన కొత్తగా కంపెనీలు ఏర్పాటు చేస్తున్నా ముందుగా మహబూబ్ నగర్ చుట్టుపక్కల కంపెనీలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని తద్వారా, మన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి అనేది ఒకటి రెండు సంవత్సరాల లోనే సాధ్యం కాదని, కనీసం పది సంవత్సరాల సమయం పట్టుతుందన్నారు.
రాబోయే రోజుల్లో మన మహబూబ్ నగర్ కు అగ్రికల్చర్, ఫార్మసీ, అదనంగా మరొక్కటి పాలిటెక్నిక్ కళాశాలను కూడా తెచ్చి ఇక్కడ పుట్టిన పిల్లలు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే చదువుకొనే విధంగా ఇంకా అధునాతన కోర్సులు, కాలేజ్ లను తెస్తామన్నారు. కోర్టు ఆవరణలో విద్యా నిధి ద్వారా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయడానికి కంప్యూటర్లు అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. యువ న్యాయవాదుల కోసం, మహిళా న్యాయవాదుల కోసం రీడింగ్ రూం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. సీనియర్ న్యాయవాది ప్రతాప్ కుమార్ విద్యా నిధికి తాను రూ 5 లక్షల విరాళం ఇస్తానని ఆ డబ్బును కోర్టు ఆవరణలో ఏర్పాటు చేయనున్న డిజిటల్ లైబ్రరీ కోసం వినియోగించాలని ఎమ్మెల్యేని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ప్రతాప్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రతాప్ కుమార్ లాగా అందరు విద్యా నిధికి సహకరించాలని సూచించారు. అనంతరం జిల్లా న్యాయవాదులకు ఆయన హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి, కార్యదర్శి శ్రీధర్ రావు, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కుర్మయ్య, ఇసి సభ్యులు ఇలియాజ్, కృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.