21-08-2025 12:00:00 AM
కలెక్టర్ పి.ప్రావీణ్య
సిర్గాపూర్, ఆగస్టు 20: సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు (సుల్తానాబాద్) ప్రాజెక్టు కింద ఉన్న రైతులకు సకాలంలో సాగునీరు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి కలిసి నల్లవాగు ప్రాజెక్టును సందర్శించారు.
ప్రాజెక్టు నీటిమట్టం సాగు సౌకర్యాలు, పునరుద్ధారణ పనుల పురోగతి పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కుడి, ఎడమ కాలువల పనులను వేగవంతం చేయ్యాలని అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఖేడ్ నియోజకవర్గంలోని రహదారి వంతెనలను పరిశీలించారు. ఆర్.అండ్.బి రోడ్లకు రూ.42 కోట్లు నిధులు మంజూరయ్యాయని త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తారని అన్నారు.
వర్షం తగ్గుముఖం పట్టాక మున్సిపాలిటీ పరిధిలోని రోడ్డు మరమ్మతులు, పనులు చేపడతారని అన్నారు. నల్లవాగు రెసిడెన్షల్ బాయ్స్ హాస్టల్ లో విద్యార్థులతో కలసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హేమంత్ కుమార్, ఇరిగేషన్ ఈఈ సుందర్, సంబంధిత అధికారులు ఉన్నారు.