21-08-2025 12:43:48 AM
-లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు
- ఎదురుచూస్తున్న లబ్ధిదారులు
- చోద్యం చూస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు
బెల్లంపల్లి అర్బన్, ఆగస్టు 20 : అధికారుల నిర్లక్ష్యం ప్రజాప్రతినిదుల అలసత్వం ఇందిరమ్మ ఇళ్లకు శాపంగా పరిణమించింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేద ప్రజల సొంతింటి కల నిజం చేసేందుకు ఇందిరమ్మ గృహ పథకాన్ని చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ గృహాల నిర్మాణం తోలి విడత ప్రక్రియ సాగుతుంది.
అయితే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మాత్రం ఇందిరమ్మ గృహాలకు గ్రహణం పట్టినట్టుంది. బెల్లంపల్లి నియోజకవర్గానికి 3500 గృహాలను తొలివిడతగా మంజూరు చేశారు. ప్రతి పట్టణ, మండల గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపిక కూడా జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ గృహాల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి.
బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రమైన పట్టణంలో మాత్రం లబ్ధిదారుల ఎంపిక ను పూర్తి చేసి అధికారులు ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారు. పట్టణంలో 867ఇళ్లు మంజూరయ్యాయి. వీటికి లబ్ధిదారుల ఎంపికను కూడా పూర్తి చేశారు. అంతటా ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. బెల్లంపల్లిలో మాత్రం ఇంకా మొదలు కాకపోవడం ఏంటన్న ప్రశ్న అందరిని వేధిస్తున్నది. ఎందుకు ఆలస్యం జరుగుతుందో కూడా తెలియడం లేదు.
తొలి విడతగా గృహ నిర్మాణాల పథకాన్ని చేపట్టేందుకు అధికారులు ముందుకు సాగడంరావడం లేదు. ప్రజా ప్రతినిధులు సైతం ఈ ప్రక్రియ పై కనీస శ్రద్ధ కనపరచడం లేదన్న విమర్శలు లబ్ధిదారుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. నియోజవర్గంలోని ప్రతి మండలంలో ఇందిరమ్మ గృహాలు నిర్మాణంలో దశలవారీగా పనులు పూర్తి అంకంకు చేరుకుంటున్నాయి.
ఇందిరమ్మ గృహాలపై నీలినీడలు
ఊర్లన్నీ ఇళ్ల నిర్మాణం పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అధికా రులు దశలవారీగా లబ్ధిదారులకు నిధులను మంజూరు చేస్తున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతంగా ఇందిరమ్మ నిర్మా ణ పనులు సాగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లోనూ ముఖ్యంగా బెల్లంపల్లి మున్సిపాలిటీ లోని 34 వార్డుల్లో ఇందిరమ్మ గృహాల నిర్మాణం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే చందంగా ఉన్నాయి.
13వ వార్డులో ఆరంభ సూరత్వంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులు ఆదిలోనే హంసపాదoగా సాంకేతిక కారణాలతో నిలిచిపోయా యి. ముందుకు సాగడం లేదు. ఇలా పట్టణంలోని మిగిలిన వార్డుల్లో ఇందిరమ్మ గృహాల నిర్మాణ పనులు ఇంకా మొదలు కాకపోవడం లబ్ధిదారులను నిరాశ పరుస్తుంది. సొంతింటి కలను నెరవేర్చుకుందా మని ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో ఇళ్ళ నిర్మాణాల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా ఇందిరమ్మ లబ్ధిదారు ల పరిస్థితి ఉంది. లబ్ధిదారుల ఎంపిక జరిగి నెలలు గడిచిపోతున్నప్పటికీ ఇందిరమ్మ గృహా పథకం అమలుకి పట్టిన గ్రహణం మాత్రం వీరుటం లేదు. ఇందులో చోద్యం ఏంటనీ పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గడ్డం వినోద్ బెల్లంపల్లి మున్సిపల్ లో ఇందిరమ్మ గృహాల నిర్మాణం పై దృష్టి పెట్టి లబ్ధిదారుల సొం తింటి కలను నెరవేర్చాలని కోరుతున్నారు.
లబ్ధిదారుల ఎంపికలో అవినీతి
ఇందిరమ్మ గృహ లబ్ధిదారుల ఎంపికలో అనేక అవకతకలు జరిగినట్టు విమర్శలు వేల్లు వెల్లువెత్తుతున్నాయిన్నాయి. ప్రతి వ వార్డుకు 25 గృహాల చొప్పున మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వెయ్యి మంది కి దాటని లబ్ధిదారుల ఎంపిక పై ఆధ్యoతం పెదవి విరుస్తున్నారు.
లబ్ధిదారులు ఎంపిక ఆయా వార్డులోని అధికార పార్టీ నాయకుల కనసన్నలో సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అర్హులకు కాకుండా తమకు అనుకూలమైన వ్యక్తులు, కార్యకర్తలకు ఇళ్ల మంజూరు జరిగిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎంపికలో అక్రమాలు, ఆశ్రిత పక్షపాతం చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
నీడలేని పేద ప్రజలకు గూడు కల్పించేందుకు చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం అర్హులకు ఆమెడ దూరంలో ఉందన్న విమర్శలు ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత గాడిదప్పిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం తో అధికారులు ప్రేక్షక పాత్రలుగా మారిపోయారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.