21-08-2025 12:41:58 AM
-సింగరేణి విద్యుత్ స్తంభాల వీధిలైట్లు మాయం
- పనిచేయని విద్యుత్ టైమర్లు నిర్లక్ష్యంగా విద్యుత్ సిబ్బంది
- విద్యుత్తు ఇంచార్జి వ్యవహారం పైపోలీసులకి ఫిర్యాదు
బెల్లంపల్లి అర్బన్, ఆగస్టు 20 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం స్టేషన్ రోడ్డు కాలనీలో వీధిలైట్లు వేయమన్నందుకి ఓ మాజీ ప్రజాప్రతినిధి పై విద్యుత్ సూపర్వైజర్ తిట్ల దండకానికి దిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాజీ ప్రజాప్రతినిధి సదరు అధికారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. తమ కాలనీలో విద్యుత్ దీపాలు అమర్చాలని అడిగినందుకు బండ బూతులు తిట్టాడని బెల్లంపల్లిలోని స్టేషన్ రోడ్డు కాలనీకి చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గుజ్జ రవి వాపోయాడు. స్టేషన్ రోడ్డు కాలనీలో వీధి దీపాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని బెల్లంపల్లి విద్యుత్ విభాగం ఇంచార్జి శ్రీనివాస్ ను కోరినట్లు పేర్కొన్నారు.
ఈ విషయమై ఆయన తన పట్ల దురుసుగా వ్యవహరించడంతోపాటు అసభ్య పదజాల దూషణలకి దిగడంతో ఆయన స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్, పోలీసు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం బెల్లంపల్లిలో చర్చనీయాంశంగామారింది.
- పనిచేయని విద్యుత్తు టైమర్లు...
విద్యుత్ టైమర్లు పనిచేయక వీధులు చీకటి మయంగా మారాయి. ఎమ్మార్వో ఆఫీస్ ఏరియా, చమ్రీ క్వార్టర్స్ ఏరియా, ఏఎంసి సబ్ కలెక్టర్ వీధి వెనుకాల ఏరియాలోనూ విద్యుత్ దీపాలు పనిచేయడం లేదు. టైమర్లు చెడిపోతున్నాయి. వాటిని మరమ్మతులు చేయకపోవడంతో స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు.
ఈ విషయాన్ని విద్యుత్ అధికారులు దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. టైమర్ల మరమ్మత్తు విషయంలోనే మాజీ కౌన్సిలర్ గుజ్జ రవి, విద్యుత్తు విభాగం సూపర్వైజర్ కి మధ్య గొడవకు కారణమని తెలుస్తోంది. వీధుల్లో దీపాలు వెలగకపోయినా, క్వార్టర్లకు విద్యుత్తు ఫీజులు పోయిన అధికారులు సకాలంలో స్పందించడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా విద్యుత్ సిబ్బంది అధికారుల్లో విధుల పట్ల అంకితభావం కలిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
సింగరేణి విద్యుత్ స్తంభాల వీధిలైట్లు మాయం..
స్టేషన్ రోడ్డు కాలనీలో పలు వీధుల్లోనూ సింగరేణి సర్ఫరా చేస్తున్న విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేసిన వీధిలైట్లు మాయమై పోతున్నాయి. ఈ లైట్లను సింగరేణి విద్యుత్ సిబ్బంది తీసుకు వెళుతున్నారని ప్రచారం ఉంది. దీంతో వీధులన్నీ చీకట్లో మగ్గుతున్నాయి. విద్యుత్ సరఫరా కోసం విద్యుత్తు స్తంభాలకు ఏర్పాటు చేసినా టైమర్లు కూడా తొలగిస్తున్నారు.
ఇదంతా విద్యుత్ విభాగం ఇంచార్జ్ కనుసన్నలోనే జరుగుతున్నదనీ కార్మికులు ఆరోపిస్తున్నారు. ఏఎoసీ ఏరియాలోనీ కొన్ని వీధుల్లో ఇలానే విద్యుత్ బల్బులు మాయమైపోతున్నాయి. విద్యుత్తు బల్బులు ఎవరు తీసుకు వెళుతున్నా మళ్లీ కొత్త బల్బులను వేయాల్సిన బాధ్యత మాత్రం సింగరేణి విద్యుత్ అధికారులపైనే ఉంది.
వీధిలైట్ల ఏర్పాటు విషయంలో అధికారులు చేతులెత్తడంతో కాలనీల్లో చీకటి రాజ్యమేలుతుంది. కార్మిక నివాస ప్రాంతాలు ప్రతిరోజు రాత్రి వీధి బల్బులు లేక చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ బల్బులు వేయాలన్నందుకే అధికారుల్లో ఆగ్రహం కట్టలుతెచ్చుకొని వస్తోంది. ఇప్పటికైనా విద్యుత్తు విభాగం అధికారుల తీరు మారాలని కార్మికులు కోరుతున్నారు.