21-08-2025 12:00:00 AM
-ఆదేశాలు పట్టించుకోని పంచాయతీ అధికారులు
-అక్రమ కట్టడాలకు యథేచ్ఛగా అనుమతులు
-నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నవైనం
కొండాపూర్, ఆగస్టు 20 : రాజు తలచుకుంటే కొదవేముందన్న చందంగా అధికారుల తీరువల్ల అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధికారుల అండదండలతో యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో అక్రమ వెంచర్లు, అనుమతి లేని లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఓవైపు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తే మండల అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
ఏకంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం పంచాయతీ అధికారులు పెడచెవిన పెడుతున్నారు. మండల పరిధిలోని మునిదేవునిపల్లి గ్రామ శివారులోని ఓ ప్రైవేట్ వెంచర్ అక్రమంగా ప్రహరీ గోడలు నిర్మించడం బహిరంగ రహస్యమైంది. గతేడాది జిల్లా పంచాయతీ అధికారి అక్రమ నిర్మాణాలపై నివేదిక ఇచ్చినా, అధికారులు పట్టించుకోలేదు. తీరా ఒత్తడి రావడంతో తూతూ మంత్రంగా గోడలను కూల్చివేశారు.
కానీ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మల్కాపూర్ శివారులోని నేషనల్ హైవే పక్కన మరో వెంచర్లో 183 సర్వే నంబర్లలో గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన 10 శాతం భూమి, పార్కు స్థలాలను నిర్వాహకులు కబ్జా చేసి రెండు, మూడు కోట్ల విలువైన ఆస్తులు హస్తగతం చేసుకున్నారు.
గిర్మాపూర్ గ్రామ పరిధిలో జాతీయ రహదారి పక్కనే అక్రమంగా అనుమతులు లేకుండా నిర్మించిన దాబాపై చర్యలు తీసుకోవాలని మండల అధికారులను జిల్లా అధికారులు ఆదేశించినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. వార్తాపత్రికల్లో కథనాలు రాసినా, కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా, అధికారులు కేవలం నోటీసులు ఇవ్వడం వరకు మాత్రమే పరిమితం అవుతున్నారు.
అక్రమార్కులకు అండగా అధికారులు...
మండలంలో అక్రమార్కులకు పంచాయతీ, రెవెన్యూ అధికారులు అండగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు, ఉన్నతాధికారుల ఆదేశాలు ఇచ్చినప్పుడు తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఆ తర్వాత వ్యవహారం ’సర్దుబాటు’ దిశగా మాయమవుతుంది. అక్రమ నిర్మాణాలు గ్రామ, మండల, జిల్లా పంచాయతీ అధికారుల అండదండలతోనే జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ, అసైన్మెంట్ భూములు, పార్కులు, కమర్షియల్ నిర్మాణాలు అన్ని బహిరంగంగానే ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గత రెండు, మూడు సంవత్సరాలుగా కొండాపూర్ మండలంలో అక్రమ కట్టడాలు, నిర్మాణాలు పెద్దఎత్తున జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
కలెక్టర్‌కు నివేదించాం...
అక్రమ కట్టడాలపై జిల్లా కలెక్టర్కు నివేదిక అందించాం. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే మునిదేవునిపల్లిలో వెంచర్ ప్రహారీ గోడ నిర్మాణంపై నోటీసులు జారీ చేశాం. ఈ విషయంలో కలెక్టర్కు సైతం నివేదిక అందించాం. కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. గిర్మాపూర్లో నిర్మించిన దాబాపై కూడా నోటీసులుజారీచేశాం.
శ్రీనివాస్, ఎంపీవో, కొండాపూర్