21-08-2025 01:03:36 AM
-ఉద్వాసన బిల్లుపై లోక్‌సభలో రగడ
-బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు అమిత్‌షాపై పేపర్లు చించేసిన విపక్ష సభ్యులు
-హోంమంత్రి షా, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మధ్య వాడీవేడి చర్చ
-జేపీసీకి మూడు కీలక బిల్లులు మధ్యయుగంలోకి వెళ్తున్నాం: రాహుల్ గాంధీ
-నేటికి వాయిదాపడ్డ లోక్‌సభ
న్యూఢిల్లీ, ఆగస్టు 20: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ (సవరణ) బిల్లు, 30 రోజుల పాటు జైలుకెళ్తే ప్రధాని, ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యుల ఉద్వాసన (130వ రాజ్యాంగ సవరణ బిల్లు), జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపుతూ నిర్ణయం తీసుకుంది.
ప్రధాని, సీఎం, పార్లమెంట్ సభ్యుల ఉద్వాసన బిల్లుపై చర్చలో ‘బిల్ వాపిస్‌లో’ అంటూ విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. నిరసనలు చెలరేగడంతో స్పీకర్ సభను పలుమార్లు వాయిదా వేయా ల్సి వచ్చింది. ఈ బిల్లులు రాజ్యాంగానికి, సమాఖ్యవాదానికి వ్యతిరేకంగా ఉన్నాయని విపక్షాలు ఆరోపించాయి. సాయం త్రం 5 గంటల తర్వాత తిరిగి సమావేశమైన లోక్‌సభ.. గేమింగ్ బిల్లుకు ఆమోదం తెలిపింది. అనంతరం స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు.
అమిత్‌షాపై పేపర్లు విసిరిన విపక్ష ఎంపీలు
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మూడు బిల్లులను సభలో ప్రవేశపెట్టిన తర్వాత చర్చ సందర్భంగా విపక్ష ఎంపీలు ‘బిల్ వాపిస్‌లో’ అంటూ నినాదాలు చేస్తూ, బిల్లు ప్రతు లను చించి అమిత్‌షాపై విసిరేశారు. సభలో హోంమంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మధ్య వాడివేడి చర్చ జరిగింది. ప్రధాని, ముఖ్యమంత్రులు, ఎంపీలు ఎవరైనా వరుసగా 30 రోజుల పాటు జైలు శిక్ష అనుభవిస్తే పదవి కోల్పోయేలా బిల్లు తీసుకొచ్చారు. ‘
అమిత్ షా గుజరాత్ హోం మంత్రిగా ఉన్నపుడు ఆయన్ను అరెస్ట్ చేశా రు. ఆ సమయంలో షా నైతిక విలువలు పాటించారా?’ అని కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు. దీనిపై హోంమంత్రి షా స్పందిస్తూ.. ‘నన్ను తప్పుడు కేసుతో అరెస్ట్ చేశారు. ఆ సమయంలో నేను మంత్రి పదవికి రాజీనామా చేశా. జైలు నుంచి విడుదలయ్యే వరకు ఏ ఒక్క రాజ్యాంగ పదవిని కూడా నిర్వహించలేదు. మీరు నాకు నైతికత నేర్పుతారా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో సభలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 2010లో అమిత్‌షా గుజరాత్ హోంమంత్రిగా ఉన్నపుడు షోరబుద్దీన్ షేక్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో అరెస్టయ్యారు. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ పదవిలో ఉండగా జైలుకెళ్లారు. ప్రతిపక్ష ఇండియా కూటమి మాత్రమే కాకుండా ఎన్డీయేతర సభ్యులు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయని, ఎన్డీయే ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని రాహుల్ ఆరోపించారు. కేసీ వేణుగోపాల్, ప్రియాంకగాంధీ తదితరులు కూడా ఈ బిల్లులను వ్యతిరేకించారు.
మధ్యయుగంలోకి వెళ్తున్నాం: రాహుల్ గాంధీ
కేంద్రం తీసుకొచ్చిన కొత్త బిల్లులపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. నల్లపు రంగు టీషర్ట్ ధరించి నిరసన తెలియజేసిన ఆయన, ఈ బిల్లులతో ఎన్డీయే దేశాన్ని మధ్యయుగంలోకి తీసుకెళ్తోందని ఆరో పించారు. ‘ఆ రోజుల్లో రాజులు ఇష్టానుసారం ప్రవర్తించేవారు. గిట్టని వారిని జైళ్లలో బంధించేవారు. బీజేపీ సైతం ఇదే విధానాన్ని అవలంబిస్తోంది. తనకు నచ్చని వారిని అరెస్ట్ చేయమని ఈడీని ఆదేశిస్తోంది’ అంటూ ఎద్దేవా చేశారు.
మహిళా ఎంపీలను తోసేశారు: టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ
సభలో చర్చ సందర్భంగా ఎన్డీయే మంత్రులు రవ్‌నీత్ సింగ్ బిట్టూ, కిరణ్ రిజిజు వెల్‌లో ఉన్న మహిళా ఎంపీలను తోసేశారని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఆరోపించారు. ‘రవ్‌నీత్ సింగ్ బిట్టూ, కిరణ్ రిజిజు మా కూటమికి చెందిన ఇద్దరు మహి ళా ఎంపీలను తోసేశారు. బీజేపీ.. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతోంది’ అని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై స్పీకర్ కార్యాలయం స్పందించింది. ఎవరిపై అలాంటి దాడి జరగలేదని ప్రకటనలో తెలిపింది. అమిత్ షా ప్రసంగిస్తున్న సమయంలో బిల్లు ప్రతులను చింపి విసిరేసిన ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయాలని స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు అందింది.
దేశాన్ని పోలీస్ రాజ్యంగామార్చే కుట్ర: అసదుద్దీన్ ఒవైసీ
ప్రజాప్రతినిధులు ముప్పు రోజుల పాటు జైల్లో ఉంటే పదవి కోల్పోతారంటూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లును తాను వ్యతిరేకిస్తున్నట్టు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ‘సీఎంలు, ఎంపీలను తొలగించాలనే కుట్రతోనే ఎన్డీయే ఈ బిల్లు తెచ్చింది. ఈ బిల్లు రాజ్యాంగవిరుద్ధం. దేశాన్ని పోలీసు రాజ్యంగా మార్చాలని బీజేపీ చూస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం’ అని ఒవైసీ మండిపడ్డారు.
ఈ మూడు బిల్లులు జేపీసీకి
దగవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ (సవరణ) బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపుతూ లోక్‌సభ నిర్ణయించింది. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జ మ్మూకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా కల్పిం చాలని కేంద్రం యోచిస్తోంది. ప్రధాని, ముఖ్యమం త్రులు, ఎంపీలు వరుసగా 30 రోజుల పాటు జైలులో ఉంటే 31వ రోజు నుంచి ఆ నేత రాజ్యాంగ పదవిని కోల్పోయేలా బిల్లును రూపొందించారు. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
గేమింగ్ బిల్లుకు ఆమోదం
కేంద్ర రైల్వే శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రవేశపెట్టిన ‘ది ప్రమోషన్ అండ్ రెగ్యూలేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్ లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు కొంతమంది బానిసలవుతూ ఆర్థికంగా మోసపోతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది.
నిబంధనలను ఉల్లంఘించి ఆన్‌లైన్ గేమ్స్ నిర్వహిస్తున్న వారికి మూడేండ్ల వరకు జైలుశిక్ష లేదా రూ.కోటి జరిమానా, ఒక్కోసారి రెండూ విధించాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. అంతే కాకుండా ఎవరైనా గేమింగ్ యాప్‌ల అడ్వర్టుజ్‌మెంట్‌లో పాల్గొంటే వారికి గరిష్ఠంగా రెండేండ్ల జైలుశిక్ష లేదా రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఆన్‌లైన్, మనీ గేమ్స్ ఆడేవారిని బాధితులుగా పేర్కొన్నారు.