21-08-2025 11:48:54 PM
కేవలం నాలుగే నెలల్లో మారిన రూపురేఖలు..
కబ్జాల చెర వీడి 28 ఎకరాలకు విస్తరణ..
నిండుకుండలా జలాశయం.. పర్యాటకులను ఆకట్టుకుంటున్న బోటు షికారు..
వరద నివారణ, భూగర్భ జలాల పెంపు..
బహుళ ప్రయోజనకరంగా అభివృద్ధి..
ఫ్లడ్ ఫ్రీ సిటీ లక్ష్య సాధనలో కీలక ముందడుగు..
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్..
హైదరాబాద్, సిటీ బ్యూరో (విజయక్రాంతి): ఒకప్పుడు నిర్మాణ వ్యర్థాలతో, మురుగు నీటితో దుర్గంధం వెదజల్లుతూ.. ఆనవాళ్లు కోల్పోయే దశకు చేరుకున్న కూకట్‌పల్లి నల్ల చెరువు నేడు సరికొత్త జలకళను సంతరించుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు స్వచ్ఛమైన నీటితో నిండి పర్యాటక శోభను సంతరించుకుంది. కేవలం నాలుగు నెలల వ్యవధిలో హైడ్రా హైదరాబాద్ రివర్స్ అండ్ లేక్స్ డెవలప్‌మెంట్ అథారిటీ చేపట్టిన అభివృద్ధి పనులతో చెరువు రూపురేఖలే మారిపోయాయి. గురువారం ఈ చెరువులో జరుగుతున్న అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఆక్రమణలపై ఉక్కుపాదం.. రెట్టింపైన విస్తీర్ణం
గతంలో ఆక్రమణల కారణంగా నల్ల చెరువు 16 ఎకరాలకు కుంచించుకుపోయింది. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన హైడ్రా, రెవెన్యూ రికార్డుల ఆధారంగా చెరువు ఎఫ్‌టీఎల్ పూర్తి స్థాయి నీటి మట్టం పరిధిని గుర్తించింది. ఇందులో భాగంగా నిర్మించిన 16 వ్యాపార షెడ్లను తొలగించింది. దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికతో పాటు, నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు ఏకంగా 4 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిపింది. ఈ కృషితో చెరువు విస్తీర్ణం దాదాపు రెట్టింపై 28 ఎకరాలకు చేరిందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ బృహత్కార్యంలో స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లతో పాటు అన్ని పార్టీల నాయకుల సహకారం ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు.
వరదకు అడ్డుకట్ట.. పర్యాటకానికి పట్టం..
నల్ల చెరువు చుట్టూ ఉన్న నివాస ప్రాంతాలు ప్రతీ వర్షాకాలం వరద ముంపుతో అతలాకుతలమయ్యేవి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా, వర్షపు నీరు సాఫీగా చెరువులోకి చేరేందుకు 7 ఇన్లెట్లను ఏర్పాటు చేశారు. చెరువు నిండినప్పుడు నీరు బయటకు వెళ్లేందుకు పాత ఔట్‌లెట్‌ను ఆధునీకరించడంతో పాటు, మరొక కొత్త ఔట్‌లెట్‌ను నిర్మిస్తున్నారు. మురుగునీరు చెరువులో కలవకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. నేడు ఈ చెరువు కేవలం జలాశయంగానే కాకుండా, ఒక పర్యాటక కేంద్రంగా మారింది. చెరువు చుట్టూ 1.5 కిలోమీటర్ల వాకింగ్ పాత్‌ను నిర్మించగా, రోజూ సుమారు 600 మంది స్థానికులు దీనిని వినియోగించుకుంటున్నారు. బోటు షికారు ఏర్పాటు చేయడంతో ఆదివారాలు, సెలవు దినాల్లో ఇది పిక్నిక్ స్పాట్‌గా కళకళలాడుతోంది. చెరువు పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరిగి, చుట్టుపక్కల బోర్లలో జీవం వచ్చింది.
‘ఫ్లడ్ ఫ్రీ సిటీ’యే మా లక్ష్యం.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
ఈ సందర్భంగా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. నల్ల చెరువు అభివృద్ధి సమయంలో ఎన్నో సవాళ్లు, విమర్శలు ఎదుర్కొన్నాం. వాటన్నింటినీ అధిగమించి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయడంతోనే ఈ సత్ఫలితాలు దక్కాయి. మొదటి విడతలో చేపట్టిన ఆరు చెరువులలో అంబర్‌పేట బతుకమ్మ కుంట, నల్ల చెరువు పనులు దాదాపు పూర్తయ్యాయి. త్వరలోనే మిగతా నాలుగు చెరువులను సిద్ధం చేసి, మరో 13 చెరువుల అభివృద్ధి పనులు చేపడతాం. వందేళ్ల క్రితం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చూపిన మార్గంలో పయనిస్తూ, చెరువుల పునరుద్ధరణ ద్వారా హైదరాబాద్‌ను ‘ఫ్లడ్ ఫ్రీ సిటీ’గా, దేశంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతాం, అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.