22-08-2025 12:39:22 AM
సిద్దిపేట క్రైమ్, ఆగస్టు 21 : రాత్రి సమయంలో దుకాణాల్లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను సిద్దిపేట టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఇన్స్పెక్టర్ ఉపేందర్ వెల్లడించారు. ఈనెల 12న రాత్రి సమయంలో సిద్దిపేట పట్టణంలోని బీజేఆర్ చేరస్తా వద్ద వైష్ణవి మెడికల్ షాప్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిహర మెడికల్ షాపు ల్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు.
షాపు యజమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా టూటౌన్ పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. హైదరాబాద్ కు చెందిన ఇందుకూరి సూర్య, మొహమ్మద్ ఆరీఫ్, తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన బాణపురం సుభాష్, బీరంగూడకు చెందిన ఎస్.కె సాజిద్ లు దొంగతనాలకు పాల్పడినట్లగా పోలీసులు గుర్తించారు. గురువారం వారిని అరెస్టు చేశారు.
హైదరాబాద్ పట్టణ శివారులో శుభాకార్యాలు ఉన్నప్పుడు ఫంక్షన్ హళ్ళలో పనిచేస్తూ రాత్రి సమయంలో దుకాణాల షెట్టర్లు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడే వారిని విచారణలో వెల్లడైంది. వారి నుంచి ఒక ఫోన్, ఆటోను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరిచినట్లు టూటౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు.