calender_icon.png 22 August, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌరవెల్లి’ పనులు స్పీడప్ చేయాలి

21-08-2025 11:20:44 PM

ఇతర డెవలప్ మెంట్ పనులనూ నిర్లక్ష్యం చేయొద్దు

అధికారులతో రివ్యూ మీటింగ్ లో మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ప్రత్యేక దృష్టి సారించారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణను వేగవంతం చేయాలని, నియోజకవర్గంలో చేపట్టిన ఇతర అభివృద్ధి పనులను నిర్లక్ష్యం చేయవద్దని అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి ఆయన హుస్నాబాద్ లోని మున్సిపల్ ఆఫీసులో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులను, ముఖ్యంగా భూసేకరణను వేగవంతం చేయాలన్నారు. ఈ విషయంలో ఏమాత్రం జాప్యం జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చూడాలని, ఇసుక, మట్టి అనుమతుల విషయంలో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని, హుస్నాబాద్ పట్టణాన్ని కాలుష్యరహితంగా, పచ్చగా ఉంచేందుకు రోడ్లకు ఇరువైపులా, డివైడర్లలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆదేశించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధిపై సమీక్షిస్తూ, ప్రతి వార్డులోనూ శానిటేషన్‌ను మెరుగుపరచాలని, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు ప్రజా ప్రతినిధులుగా ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, ప్రజలకు సక్రమంగా సేవలు అందించడంలో నిబద్ధతతో పనిచేయాలన్నారు.