calender_icon.png 22 August, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిహారం రాలే.. చావు వచ్చింది

22-08-2025 12:36:12 AM

  1. గుండెపోటుతో రైతు మృతి
  2. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కారాలయ ఆవరణలో విషాదం

సిద్దిపేట, ఆగస్టు 21 (విజయక్రాంతి): ప్రభుత్వం నుంచి పరిహారం కోసం ఎదురు చూసిన రైతుకి చివరికి చావే వచ్చింది. ఈ విషాదం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ఆవరణలో చోటు చేసుకుంది. వివరాలు.. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజె క్టు కింద నిర్మించాల్సిన కెనాల్ కోసం సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్, అర్బన్ మండలం తడకపల్లి గ్రామాల్లోని 97 మంది రైతులకు చెందిన భూమిని ప్రభుత్వం తీసుకుంది.

ఆరేళ్ల క్రితం భూసేకరణ చేసిన ప్రభు త్వం బాధిత రైతులకు పరిహారం ఇవ్వలేదు. అప్పటినుంచి రైతులు ప్రభుత్వ కార్యాలయా ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. గత ప్రభుత్వం భూమి సేకరించి పరిహారం ఇవ్వకపోగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చాక పరిహా రం ఇస్తుందనే ఆశతో రైతులందరూ మం త్రుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇటీవల వెంకటాపూర్ గ్రామానికి వచ్చిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని రైతులందరూ కలిసి వినతి పత్రం అందజేశారు.

స్పందించిన మంత్రి జిల్లా కలెక్టర్‌ను కలవాలంటూ సూచించారు. గురువారం రైతుల అందరితో కలిసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన రైతు బాలకిష్టయ్య గుండెపోటుతో అక్కడే మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన గుండాల బాలకిష్టయ్య (57) గురువారం కలెక్టర్‌ను కలిసేందుకు తోటి రైతులతో కలిసి వెళ్లాడు. రైతులందరూ కార్యాలయం వద్ద కూర్చోగా బాల కిష్టయ్య మూత్ర విసర్జన కోసం కార్యాలయం ఆవరణలోని చెట్లపొదల చాటుకు వెళ్లాడు.

అక్కడ గుండెపోటు రావడంతో  కుప్పకూలి ఆక్కడికక్కడే తుది శ్వాస విడిచాడు. బాలకృష్ణయ్య వెళ్లి చాలాసేపైనప్పటికీ రాకపోవడంతో తోటి రైతులు ఆయనను పిలిచేందుకు వెళ్ల గా కింద పడి ఉండటాన్ని గమనించారు. విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలియజేశారు.  మృతి చెందిన రైతు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని తోటి రైతులు డిమాండ్ చేశారు.