calender_icon.png 9 October, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగొద్దు

09-10-2025 12:00:00 AM

కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్

నల్గొండ టౌన్ అక్టోబర్ 8: పత్తి కొనుగోలు లో రైతులకు ఇబ్బంది కల్గకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా త్రిపాఠి అన్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా ఏర్పాటు చేసిన ‘కపాస్ కిసాన్ యాప్ పై రైతులకు అవగాహన కోసం బుధవారం నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు ఉద్దేశించి ఉదయాదిత్య భవన్ లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గత సంవత్సరం రైతులు పత్తి ని అమ్మేందుకు ఆన్ లైన్ లో తప్పు బుకింగ్ చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ సంవత్సరం అలాంటి సమస్యలు రాకుండా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు.  ‘కపాస్ కిసాన్ యాప్‘ ప్రకారం పత్తి రైతులు అందరు స్లాట్ బుక్ చేసుకోవాలని, కౌలు రైతులు మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్పష్టం చేశారు. రైతులందరూ ఒకేసారి జిన్నింగ్ మిల్లులకు పత్తిని తీసుకు రాకుండా నిర్ణీత షెడ్యూల్ ను రూపొందించాలన్నారు. 

 రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, కాపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్,మద్దతు ధర,పత్తి నాణ్యత ప్రమాణాల వివరాలు తెలియజేసారు.జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ పత్తి కొనుగోలుకై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ‘కపాస్ కిసాన్ యాప్‘ గురించి వివరించారు.

రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన పత్తిని తీసుకురావాలని, జిల్లా వ్యవసాయ అధికారులు ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజియన్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి, డీఏవో శ్రవణ్ కుమార్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల వ్యవసాయ , మార్కెటింగ్ శాఖ అధికారులు , సిబ్బంది హాజరయ్యారు.