calender_icon.png 9 October, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకాష్‌నగర్ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

09-10-2025 12:00:00 AM

భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 8  (విజయక్రాంతి): కొత్తగూడెంలో ప్రకాష్నగర్ అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం  జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారుల హాజరు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య పర్యవేక్షణ, విద్యా కార్యక్రమాల అమలు విధానాలను సమీక్షించారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి, పిల్లలకు సమయానికి ఆహారం, పాలు, గుడ్లు అందజేయాలని ఆదేశించారు. 

గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు అందించే పోషకాహార పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా అనే విషయంపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ భవనం పరిశుభ్రత, పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆట వస్తువులు, నేర్చుకునే సామగ్రి వాడకం తదితర అంశాలపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రతి అంగన్వాడీ కేంద్రం బాలల సమగ్రాభివృద్ధికి కేంద్రబిందువుగా మారాలని, పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ పరిశీలనలో అంగన్వాడీ సిబ్బంది , సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.