02-09-2025 12:00:00 AM
రేగొండ సెప్టెంబర్ 1 (విజయ క్రాంతి): మండల కేంద్రంలోని పిఎసిఎస్ గోదాం వద్ద రైతులు యూరియా కోసం అగచాట్లు పడ్డారు.సోమవారం వర్షం పడుతున్నా లెక్కచేయకుండా యూరియా బస్తాల కోసం ఉదయం నుండే మండల ప్రజలు బారులు తీరారు.
దీంతో ఒక్కసారిగా పిఎసిఎస్ గోదాం వద్ద కొంత ఉద్రిక్తత నెలకొంది. స్థానిక పోలీసులు చొరవ తీసుకొని రైతులను క్యూ లైన్ లో నిల్చోబెట్టారు. మూడు రోజులు యూరియా కోసం పడి గాపులు కాస్తే మా మొఖాన ఒక్క బస్తా పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూరియాను కూరలో ఉప్పులా వాడాలా: స్థానిక రైతు కనికి రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డికి రైతులపై చిత్తశుద్ధి లేదు.నాకు 5 ఎకరాల సాగు ఉంది ఒక్క బస్తా ఇస్తాన ంటున్నారు.ఒక్క బస్తా ను కూరలో ఉప్పు వాడినట్లు వాడాలా.తెల్లారి లేస్తే సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో బుర్రుమని తిరుగుతావ్.జర మా రైతుల మొఖాన చూడు మా గోస కనబడుతది. మార్పు రావాలి మార్పు రావాలి అంటే యూరియా కోసం రైతులు లైన్లో నిల్చునే మార్పు వచ్చింది.
తరిగొప్పుల మండలంలో..
తరిగొప్పుల, సెప్టెంబర్ 1 (విజయ క్రాంతి ) జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో యూరి యా కొరతతో సోమవారం ఉదయాన్నే రైతులు యూరియా కోసం ఫర్టిలైజర్ గోదాముల వద్ద బారులు తీరారు. ఓ వైపు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా, వానకు తడుస్తూ రైతులు క్యూ లైన్ లో నిలబడ్డారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని యూరియా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.