02-09-2025 12:00:00 AM
కామారెడ్డి, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): యూరియా బస్తా కావాలంటే గడ్డి మందు కొనుక్కోవాల్సిందే అని ఎరువుల వ్యాపారులు రైతులకు కొర్రి పెడుతున్నారు. యూరియా బస్తా కోసం ప్రైవేట్ ఎరువుల వ్యాపారులు రైతుల అవసరాలను గుర్తించిన వ్యాపారులు రైతులకు అవసరం లేకున్న గడ్డి మందు అంటగడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఎరువుల వ్యాపారులు యూరియా ఎరువులను కృత్రిమ కొరత సృష్టిస్తూ రైతులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు.
పర్యవేక్షించి నియంత్రించాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి లో రైతులు వ్యాపారులు చేస్తున్న నిలువు దోపిడిని ప్రశ్నించడమే కాకుండా అధికారులకు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవలసిన అధికారులు పట్టించుకోవడం లేదు. గడ్డి మందు యూరియా బస్తా కలిపి రూ. 2700 లకు విక్రయిస్తున్నట్లు రైతులు తెలిపారు.
ప్రైవేటు వ్యాపారుల తీరు ఒక రకమైతే మరోవైపు విండో కార్యాలయాల్లో యూరియా బస్తాల పంపిణీలో అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారు. రైతులకు సరిపడా స్టాకు రాలేదని చెప్తూ ఉదయం నుంచి రాత్రి వరకు యూరియా బస్తాల కోసం రైతులు క్యూ లైన్ లలో నిలబడి విసిగి వేసారుతున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ విండోలో సోమవారం రైతు లు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు మాత్రం రైతుల అవసరాలను గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం రైతులు రోజురోజుకు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. అధికారులు మాత్రం రైతులకు సరిపడా యూరియా ను తేవడం లేదు. రైతులకు కావలసిన యూరియా స్టాకు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. యూరియా కోసం తెల్లవారుజాము నుంచి క్యూ లైన్ కట్టిన సరిపడ యూరియా బస్తాలను ఇవ్వడం లేదు.
దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, పెద్ద మల్లారెడ్డి, రాజంపేట, తాడువాయి, బిక్కనూర్, సదాశివ నగర్ మండల కేంద్రాల్లోని విండో కార్యాలయాల ఎదుట రైతులు యూరియా కోసం సోమవారం బారులు తీరారు. ఇదే ఆసరాగాచేసుకున్న ప్రవేట్ ఎరువుల వ్యాపారులు రైతులకు గడ్డి మందు కొనుగోలు చేస్తేనే యూరియా బస్తా ఇస్తామంటూ షరతులు విధించడంతో రైతులకు గడ్డి మందు అవసరం లేకున్నా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు అంటున్నారు.
వ్యాపారులు సిండికేట్ గా మారి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులకు, విండో కార్యాలయం అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి సింగల్ విండో కార్యాలయం ఎదుట ఉదయం నుంచి రైతులు బారులు తీరారు. రైతులకు సరిపడా యూరియా స్టాకు లేదని విండో అధికారులు చెప్పడం రైతులను తీవ్ర ఆందోళన కు గురిచేస్తుంది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా బస్తా కోసం క్యూ కట్టిన ఒక యూరియా బస్తా కూడా అందుతుందా లేదా అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారు. ఒక్కో విండో పరిధిలో నాలుగు గ్రామాల రైతులు ఉండడంతో యూరియా కోసం నాలుగు గ్రామాల రైతులు వచ్చి క్యూలైన్లో వేచి చూస్తున్నారు. ముందుగా వచ్చిన వారికి యూరియా బస్తాలు అందుతున్నాయని ఆలస్యం గా వచ్చినవారికి సాయంత్రం వరకు వేచి చూసిన యూరియా బస్తాలు అందడం లేదని రైతులు తెలిపారు.
ప్రతిరోజు కామారెడ్డి జిల్లాలో ఎక్కడో ఒకచోట యూరియా కోసం రైతులు క్యూ లైన్ లో నిలబడడం ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు యూరియా కొరత పై రైతులు వివరిస్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నేరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని రైతుల ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని స్టాక్ లేని సొసైటీల వద్ద కు అదనంగా యూరియాను తెప్పించాలని రైతులు కోరుతున్నారు.
జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా బస్తాలను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని తాడువాయి, భిక్కనూర్, మాచారెడ్డి, రాజంపేట, ఎర్ర పహాడ్, మాచారెడ్డి, లింగంపేట్, బిబిపేట్, తదితర మండల కేంద్రాలతో పాటు మేజర్ గ్రామపంచాయతీలో నీ విండోల లో యూరియా తగినంత స్టాక్ లేక రైతులు నిత్యం తంటాలు పడుతున్నారు.
ఉదయం నుంచి రాత్రి వరకు క్యూలైన్లలో నిలబడి యూరియా కోసం పడిగాపులు కావలసి వస్తుందని రైతులు అంటున్నారు. సదాశివ నగర్ లో రైతులు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలి..
రైతులకు సరిపడా యూరియాను ప్రభుత్వం సరఫరా చేసి ఆదుకోవాలి. రైతులు నిత్యం యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదు.
- రాజేందర్, రైతు, రెడ్డి పేట, కామారెడ్డి
తిండి లేక యూరియా కోసం పాట్లు
యూరియా బస్తా కోసం తిండిని పక్కకు పెట్టి క్యూలైన్లో నిల్చవలసి వస్తుంది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలి.
నర్సారెడ్డి, రైతు, తాడువాయి, కామారెడ్డి జిల్లా
యూరియా సరఫరా కోసం కృషి చేస్తున్నాం..
కామారెడ్డి జిల్లాలో రైతులకు సరిపడా యూరియా స్టాక్ కోసం ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. త్వరలోనే స్టాకు వస్తుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్టాక్ ఉన్నంతవరకు విండోల ద్వారా పంపిణీ చేస్తున్నాం.
- మోహన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి, కామా రెడ్డి