06-05-2025 12:59:11 AM
ఏపిఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు
కల్లూరు,మే5(విజయ క్రాంతి) ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని ఐకేపి అధికారుల నిర్లక్ష్యం వల్ల కొనుగోలు కేంద్రం లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుందని ఆరోపిస్తూ తక్షణమే ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలంటే డిమాండ్ చేస్తూ సోమవారం రైతన్నలు జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించింది.
పట్టణం ప్రధాని రహదారిపై అంబేద్కర్ విగ్రహం వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి, దాన్యం కొనుగోలు చేయాలంటూ ధర్నా చేశారు. పుల్లయ్య బంజర శివాలయం ఆవరణంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో, దాన్యం కొనుగోలు జరగడం లేదని వారు ఆరోపించారు.
ఆరుగాలం పండించిన పంట అకాల వర్షాలకు తడిసి నష్టం వాటిల్లుతుందని, ఐకెపి సెంటర్ నిర్వాహకులు నిర్లక్ష్యం వల్ల చేతికి వచ్చిన పంట వానపాలు అవుతుందన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. . ఈ కార్యక్రమంలో పసుపులేటి సుబ్బారావు, కిష్టం శెట్టి నరసింహారావు, బంజర ఐకెపి సెంటర్ రైతులు పాల్గొన్నారు.