03-07-2025 12:54:47 AM
ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్
మహబూబాబాద్, జూలై 2 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని, ధరణి వల్ల ఎన్నో అవస్థలు పడ్డ రైతులకు భూభారతి ద్వారా భూ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామని, రైతు భరోసా అమలుచేసి, సాగుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నామని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు. బుధవారం జిల్లాలోని మరిపెడ పట్టణంలో రైతులకు కంది విత్తనాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, రైతులకు సబ్సిడీలు, వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు ఎక్కడికి అక్కడే విత్తనాలను ఉత్పత్తి చేసుకునే విధంగా అవసరమైన సహకార అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ విజయచంద్ర, టెక్నికల్ ఏవో శ్రీదేవి, ఏ ఈ ఓ లు శ్రీకాంత్, రెగ్యానాయక్, అశోక్, శ్వేత, సాయి శృతి, అరవింద్ పాల్గొన్నారు. మరిపెడ డివిజన్ కు 150 కంది విత్తన ప్యాకెట్లు కేటాయించడం జరిగిందని, మండలానికి 17 చొప్పున కేటాయించడం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.