25-10-2025 04:36:24 PM
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి శివకుమార్..
తుంగతుర్తి (విజయక్రాంతి): అధిక వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకోవాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని కామ్రేడ్ దుబ్బాక సంజీవరెడ్డి విజ్ఞాన కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ వారం రోజులుగా జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాలతో రైతాంగం అన్ని విధాలుగా నష్టపోయినారని, కోసిన వరిచేలు ఐకెపి కేంద్రంలో తడిసి ముద్దయినాయని, కోతకు వచ్చిన వరిచేలు గాలి వర్షాలతో నేలలకు ఒరిగినాయని, చేతికి అందిన పంట వర్షాలతో నేలపాలైనాయని రైతాంగం దుఃఖంతో ఉన్నారని ఆయన ఆవేదన చెందారు.
పత్తి చేలు పత్తి ఏరకుండానే గింజలు మొలకెత్తి పాచిపోయిందని, అప్పుచేసి పంటలు పండిస్తే మొత్తం పంటలన్ని వర్షార్పణం అయినాయని ఆయన ఆవేదన చెందారు. తడిసిన పత్తి, వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. సీసీఐ ద్వారా పత్తిని, ఐకెపి కేంద్రాల ద్వారా వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల మా పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి పేర్ల నాగయ్య, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, టియుసిఐ జిల్లా అధ్యక్షులు గొడ్డలి నరసయ్య, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వేర్పుల లక్ష్మయ్య, పివైఎల్ జిల్లా కార్యదర్శి వేర్పుల పరుశురాం తదితరులు పాల్గొన్నారు.