calender_icon.png 25 October, 2025 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక ట్రాక్టర్ల వలన రోడ్లు ధ్వంసం, వ్యవసాయ రైతుల పొలాలకు నష్టం

25-10-2025 04:33:51 PM

ఇసుక రవాణా నిలిపివేయాలని తహశీల్దార్‌కు గ్రామస్తుల వినతి

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): వేములవాడ రూరల్ మండలం మల్లారం రాజనగర్ గ్రామ పరిధిలోని మూలవాగు నుండి రెవెన్యూ అధికారుల అనుమతితో జరుగుతున్న ఇసుక తరలింపుపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక ట్రాక్టర్ల కారణంగా తమ గ్రామంలో రోడ్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయని, ముఖ్యంగా వ్యవసాయ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొంటూ గ్రామ ప్రజలు శనివారం తహశీల్దార్ అబూబాకర్ కి వినతి పత్రాన్ని సమర్పించారు.

గ్రామంలో మూలవాగుకు వెళ్లే రోడ్డు అతిచిన్నదిగా, కేవలం ప్రజలు మరియు వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే ఉందని గ్రామస్తులు తెలిపారు. అయితే, ఇసుక ట్రాక్టర్లు పోవడం వలన ఈ రోడ్డు పూర్తిగా చెడిపోయి, పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ట్రాక్టర్లు పక్కనే ఉన్న వ్యవసాయ రైతుల భూముల్లోకి చొచ్చుకెళ్లి ప్రయాణిస్తున్నాయి. దీనివలన రైతులు తీవ్రంగా నష్టపోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక ట్రాక్టర్లు రాజనగర్ గ్రామం గుండా అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వలన ఇప్పటివరకు సుమారు 4 నుంచి 5 సార్లు ప్రమాదాలు జరిగాయని గ్రామస్తులు తెలిపారు.

డ్రైవర్ల నిర్లక్ష్యంపై ప్రజలు ప్రశ్నించగా, వారు తమపైకే ఇష్టానుసారంగా గొడవ పడుతున్నారని, దూషిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇసుకను నిరంతరం తోడివేయడం వలన గ్రామ ప్రజల ముఖ్య నీటి వనరులైన నల్లాల బావి ఎండిపోయే ప్రమాదం ఉందని, అంతేకాక రైతుల వ్యవసాయ బోర్లు కూడా భూగర్భ జలాలు అడుగంటడం వల్ల ఎండిపోయే స్థితికి చేరుకుంటున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను గతంలో పలుమార్లు తహశీల్దార్ అధికారికి ఫోన్ చేసి తెలియజేసినప్పటికీ పరిష్కారం లభించలేదని గ్రామ ప్రజలు వినతి పత్రంలో పేర్కొన్నారు.

ముఖ్యంగా తేదీ: 24-10-2025 రోజున ఉదయం 10 గంటల నుండి దాదాపు సాయంత్రం 5 గంటల వరకు ట్రాక్టర్లు అతివేగంగా ఇసుకను తరలించుకుపోతూనే ఉన్నాయని తెలిపారు. తమ గ్రామ ప్రజలకు, వ్యవసాయ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, మల్లారం రాజనగర్ మూలవాగు నుండి ఇసుక తీయడానికి ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేయాలని మరియు ఇసుక ట్రాక్టర్ల రవాణాను పూర్తిగా నిలిపివేయాలని గ్రామ ప్రజలు, రైతులు, తాసిల్దారును గట్టిగా కోరారు.ఈ కార్యక్రమంలో న్యాయవాది అనిల్, ప్రవీణ్, కిషన్, మహేందర్, మహేష్, హరీష్, వంశీ, సందీప్, రవితేజ, స్వామి తదితరులు పాల్గొన్నారు.