04-09-2025 10:45:27 PM
జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్(District Panchayat Officer Bikshapathi Goud) అన్నారు. గురువారం తిర్యాణి మండలంలోని దంతన్ పల్లి, బుగ్గ గూడ, గిన్నెధరి బాలికల ఆశ్రమ పాఠశాలలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి మల్లేష్ తో కలిసి సందర్శించి పాఠశాలల పరిసరాలు, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు. అనంతరం గిన్నెధరి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి వార్డులు, రిజిస్టర్లు, జర బాధితుల వివరాలను పరిశీలించారు.
ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. జ్వర కేసులు నమోదు అవుతున్న దృష్ట్యా గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, పంచాయితీ, వైద్య ఆరోగ్యశాఖల సిబ్బంది సమన్వయంతో ఇంటింటి జ్వర సర్వే చేసి సత్వర వైద్య సేవలు అందించాలని తెలిపారు. చింతపల్లి గ్రామంలో జ్వరంతో బాధపడుతున్న వారిని, వైద్య సహాయం పొందుతున్న బాలికలను కలిసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అంటు వ్యాధులు ప్రబలకుండా పాటించవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.