24-07-2025 01:11:14 AM
ఫెర్టీ-9 ఫెర్టిలిటీ సెంటర్ సీఈఓ వినేష్ గాధీయా
ముషీరాబాద్, జూలై 23(విజయక్రాంతి): ఈనెల 25న ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పురుష సంతానోత్పత్తిపై ఫెర్టీ-9 సికింద్రాబాద్ లోని కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఫెర్టీ-9 ఫెర్టిలిటీ సెంటర్ సీఈఓ వినేష్ గాంధీయా తెలిపారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫెర్టీ-9 మెడికల్ డైరెక్టర్ జ్యోతి సి బుడి తో కలసి కార్యక్రమ లోగోలను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రారంభ కార్యక్రమా నికి సినీ నటి లయ హాజరవుతారని తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దంపతులు, నిపుణులను ఒకే వేదికపై తీసుకువచ్చి, వెనకడుగు వేస్తున్న పురుషులను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఐక్య రాజ్య సమితి జనాభా నిధి(యూఎన్‌ఎఫ్ పీఏ) గణాంకాల ప్రకారం భారత దేశ సగటు సంతానోత్పత్తి రేటు 1.9 కి తగ్గిపోయిందని తెలిపారు. సంతానోత్పత్తి రేటు తెలంగాణ(1.8), ఏపీ(1.7)లో తక్కువ ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫెర్టీ-9 అత్యధిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత సీమెన్ ఎనలైజర్ ను ప్రవేశపెట్టి రెండు రాష్ట్రాల్లో మొట్ట మొదటి సారి ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ప్రారంభ దశలోని సరైన రోగ నిర్ధారణ ప్రతి జంట సంతానోత్పత్తి ప్రయాణాన్ని మారుస్తుందని అన్నారు. పురుషుల ఫెర్టిలిటీ టెస్టింగ్ ను సాధారణ ఆరోగ్య పరీక్షల మాదిరిగానే వేగవంతంగా, సమర్థవంతంగా, సంకోచం లేని విధంగా మార్చాలనేది తమ ప్రయత్నం అన్నారు. ఎందుకంటే సంతానోత్పత్తి బాధ్యత మహిళలది మాత్రమే కాదని, ఇద్దరి భాగస్వామ్య బాధ్యతగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ మాధురి, డాక్టర్ సత్య దీపిక, డాక్టర్ జ్యోతి, డాక్టర్ రోహిత్, డాక్టర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు.