calender_icon.png 14 August, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువు కరువు!

14-08-2025 02:16:10 AM

- యూరియా కోసం రైతుల గోస 

- సొసైటీ కార్యాలయాల వద్ద బారులు

- స్టాక్ లేదంటున్న అధికారులు 

- నిరాశతో వెనుదిరుగుతున్న అన్నదాతలు

మహబూబాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎరువు కరువుగా మారింది. రైతులు ప్రతి రోజు సొసైటీ కార్యాలయాల వద్దకు యూరియా కోసం రావడం.. స్టాక్ లేదనే సమాధానంతో నిరాశ చెందడం.. కొద్దిసేపు యూరియా కోసం అధికారులతో వాగ్వాదానికి దిగడం.. ఈరోజు వచ్చిన వారి ఆధార్ కార్డులు ఇవ్వండి, రేపు యూరియా రాగానే ముందు మీకే ఇస్తామని అధికారులు సమాధానం చెప్పడం నిత్యకృత్యంగా మారింది.

బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు నెల్లికుదురు మండల కేంద్రాల్లో రైతులు యూరియా కోసం నిరీక్షించారు. నెల్లికుదురు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులు సొసైటీ కేంద్రం వద్ద బారులు తీరారు. గొడవ జరగకుండా పోలీస్‌లు, ఏవో షేక్ యాస్మిన్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక్కో రైతుకు రెండు, మూడు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేశారు. 334 మంది రైతులకు 668 బస్తాల యూరియాను పంపిణీ చేశారు.

ఇక జిల్లా కేంద్రంలో సుమారు 50 మంది రైతులు యూరియా కోసం కంకర్ బోర్డులోని సొసైటీ ఎరువుల విక్రయ కేంద్రం వద్దకు ఉదయం వచ్చారు. సొసైటీ అధికారులు యూరియా స్టాక్ లేదని చెప్పడంతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారధి రెడ్డి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేక వీరన్న తదితరులు అక్కడికి చేరుకొని రైతులతో కలిసి సొసైటీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అవసరమైన యూనియన్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఏడిఏ శ్రీనివాసరావు, ఏవో తిరుపతిరెడ్డి అక్కడికి చేరుకొని , ఈరోజు స్టాక్ లేకపోవడంతో యూరియా పంపిణీ చేయడం లేదని, యూరియా రాగానే రైతులకు పంపిణీ చేస్తామని చెప్పి, రైతుల ఆధార్ కార్డులను సేకరించారు. 

మంచిర్యాలలో

మంచిర్యాల(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో ఎరువుల కొరత రోజురోజుకు ఎక్కువ అవుతుంది. అధికారులు జిల్లాకు అవసరానికి మించి తెప్పించాం అని ప్రకటనలు చేస్తున్నారు కానీ అది క్షేత్రస్థాయిలో రైతులకు ఏమేరా అందుతుందో దృష్టి సారించడం లేదు.

జిల్లాకు ఇప్పటివరకు 19,714 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయ్యిందని, ఇందులో మండలాలకు 18,553 మెట్రిక్ టన్నులు సరఫరా చేయగా 16,291 మెట్రిక్ టన్నులు అమ్మకాలు జరిగినట్లు ఈపాస్ మిషన్ల ద్వారా వెల్లడిస్తున్నా రు. ప్రస్తుతం రిటైల్ డీలర్ల వద్ద 2,262 మెట్రిక్ టన్నులు, మార్క్‌ఫెడ్‌లో 662.06 మెట్రిక్ టన్నులు, కమిషనర్ రిజర్వ్ పుల్‌లో 499.70 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు.

అధికారిక లెక్కల ప్రకారం సాగైనా పంటలకు 18,887 మెట్రిక్ టన్నులు మాత్రమే అవసరం ఉంటుందని, అవసరానికంటే 827.76 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా చేసినట్లు ప్రకటిస్తున్నారు. గ్రామాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులు మరోలా ఉన్నాయి. బుధవారం కోటపల్లి మండల కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయానికి 266 బ్యాగుల యూరియా రాగా సమీప గ్రామాల రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు 600 పైగా టోకెన్లు అందజేశారు. అధిక సంఖ్యలో రైతులు వచ్చినా.. ముందు వరుసలో ఉన్నవారికే దక్కాయి. 

గజ్వేల్‌లో నో స్టాక్ బోర్డు 

గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో యూరియా కోసం రైతులు ఒకేసారి రావడంతో అధికారులు నో స్టాక్ బోర్డు పెట్టారు. బుధవారం 30 టన్నుల యూ రియా రాగా అంతకుముందు రోజే వ్యవసాయ అధికారులు టోకెన్లు పంపి ణీ చేశారు. యూరియా తీసుకొని తొం దరగా పొలం పనుల్లోకి వెళ్లాలన్న ఆలోచనతో రైతులు ఉదయం ఆరు గంటల నుంచి గజ్వేల్ పిఎసిఎస్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.

అధికారులు వచ్చేసరికి అధిక సంఖ్యలో రైతులు యూరి యా కోసం ఎగబడడంతో అధికారులు నో స్టాక్ బోర్డు పెట్టారు. యూరియా ఇంకా రాలేదని రాగానే పంపిస్తామని చెప్పారు. దీంతో రైతులు తీవ్ర అసహనానికి గురయ్యారు. బిఆర్‌ఎస్ నాయకులు చేరుకుని అధికారులను యూరియా గురించి ప్రశ్నించారు. యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే యూరియా లోడ్లు వచ్చిన సమాచారం అందడంతో రైతులకు యూరియాను పంపిణీ చేశారు.