calender_icon.png 14 August, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లెండి..మొండి..!

14-08-2025 12:00:00 AM

-ఇరు రాష్ట్రాల  అధికారుల సమన్వయ లోపం 

-కామారెడ్డి జిల్లా రైతులకు శాపం 

-40 సంవత్సరాలుగా పూర్తికాని లెండి ప్రాజెక్టు

-60 ఎకరాల సాగుకు నోచుకోని వైనం

-నాలుగు దశాబ్దాలుగా నాంచుతున్న అధికారులు 

-నేటికీ పూర్తికాని లెండి ప్రాజెక్ట్ ఏడాదిలో పూర్తి చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే 

-నేటికీ పనులకు మోక్షం  కలుగలేదు

కామారెడ్డి/జుక్కల్, ఆగస్టు 10 (విజయ క్రాంతి) : లేండి ప్రాజెక్ట్ మొండిగానే మారింది. ప్రాజెక్టు పనులు ప్రారంభించి 45 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేటికీ పనులు పూర్తి కాకుండా సాగునీరు కామారెడ్డి జిల్లా రైతులకు అందడం లేదు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో నిర్మిస్తున్న అంతర్రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టు అయినటువంటి లేండి ప్రాజెక్టు నాలుగు దశాబ్దాల పాటు పనులు పూర్తికాక అసంపూర్తిగానే మిగిలి ఉంది.

అయితే ఇదే విషయంపై ప్రస్తుత జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఈ విషయాలన్నీ తెలుసుకొని 2024 లో ప్రాజెక్టును సందర్శించి ఏడాది కాలంలో 2025 నాటికి పనులు పూర్తి అయ్యేవిధంగా చూస్తామని రైతులకు 60 వేల ఎకరాల లో సాగు నీరు అందిస్తామని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.అయితే ఈ వివరాలు తెలుసుకోవడానికి పనులను పరిశీలించడానికి విజయక్రాంతి ప్రతినిధి ప్రాజెక్టును సందర్శించిన తర్వాత పలు విషయాలు తెలిశాయి.

అక్కడి మహారాష్ట్ర ఇరిగేషన్ అధికారులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రాజెక్టు పనులు గత ఆరు నెలల క్రితమే ప్రారంభం అయ్యాయని, పనులు పూర్తి అయ్యేందుకు మరో రెండు సంవత్సరాలు పడుతుందని చెప్పారు. అక్కడ పనులు నత్తనడకన  కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలంగాణ అధికారులకు బోల్తా కొట్టించేందుకు పనులు నామమాత్రంగా చేపడుతున్నారని బిచ్కుంద మండలాల రైతులు చెబుతున్నారు.

పనులు చేసే ఉద్దేశమే ఉంటే గత 12 సంవత్సరాలుగా పనులు పూర్తిగా ఎందుకు నిలిపివేశారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 14 గేట్లు నిర్మించగా అందులో 10 గేట్లుపూర్తి అయ్యాయి. మిగతా నాలుగు గేట్లు మిగిలిపోయాయి. ప్రాజెక్టు పైన ఉండే మిషన్లు అదేవిధంగా గేట్లకు తలుపులు ఏవి కూడా అమరచలేదు. ఎప్పుడో కొన్ని సంవత్సరాలు క్రితం తెచ్చిన సామాగ్రి మొత్తం తుప్పుపడి పోయింది. ఎక్కడి పనులు అక్కడే అన్నట్లుగా కనిపిస్తోంది.

2025 లో ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు నీరు అందే విధంగా చూస్తానన్న జుక్కల్ ఎమ్మెల్యే హామీ నీరుగారి పోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు నీటి కోసం తెలంగాణలో భాగమైన మద్నూర్, బిచ్కుంద మండల రైతులకు సాగు నీరు అందించేందుకు కాలువలను తీశారు. కానీ ఇప్పటికీ సిమెంట్ పనులు జరిగినప్పటికీ అందులో ముళ్లపొదలు, తుంగ, పిచ్చి గడ్డి లాంటి మొక్కలు పెరిగిపోయాయి. కనీసం వాటికి మరమ్మతులు చేపట్టి పనులు కూడా చేయలేదు.

 ఇది ప్రస్తుతం అంతర్రాష్ట్ర లేండి ప్రాజెక్ట్ ఉన్న పరిస్థితి.

ఇక ప్రాజెక్టు పూర్తి వివరాలను చూస్తే దీనిని 1984లో తెలంగాణ, మహారాష్ట్ర రైతుల కోసం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గా ఉన్న సమయంలో నిర్మించారు. దీనిని మహారాష్ట్ర ,నాందేడ్ జిల్లా దెగ్లూర్ తాలూకా గోజేగావ్ గ్రామం వద్ద నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యం మహారాష్ట్రలోని కొన్ని గ్రామాలకు అదేవిధంగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లా మద్నూర్, బిచ్కుంద మండలాల్లో కలిపి సుమారు 60 వేల ఎకరాలకు సాగునీరు అందే విధంగా నిర్దేశించబడ్డది.

ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యం 6.36 టిఎంసిలు ఉంది. ఇందులో మహారాష్ట్రకు 3.93 తెలంగాణకు  2.43 టీఎంసీల నీటిని కేటాయించారు. 1984 లోని అంచనా వ్యయం 54.55 కోట్లతో నిర్మించడానికి తలపెట్టారు. ప్రస్తుతం దీని ఖర్చు 1000 కోట్లు దాటిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పనులు డ్యామ్, స్పిల్వే కాలువలు పనులు పూర్తి కాలేదు. ఎర్త్ డ్యాం పనులు సుమారు 70% స్పిల్వే పనులు 80 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది.

ప్రాజెక్టు పూర్తి అయితే వర్షా ఆధారిత రైతులకు సాగునీరు మెట్ట భూములకు నీరు అందే అవకాశం కలుగుతుంది. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాన సమస్యలు ఏమిటంటే నిధులు ముడిపడి, భూసేకరణలు సమస్యలు అదేవిధంగా పునరావాసం రెండు రాష్ట్రాల అధికారుల నిర్లక్ష్యం వల్ల పనులు 12 సంవత్సరాల పాటు నిలిచిపోయాయి. తెలంగాణకు 22 నుంచి 23 వేల ఎకరాలకు అదేవిధంగా మహారాష్ట్రలో 39వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది.

ముఖ్యంగా లేండి ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేకపోవడానికి పలు రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య అవగాహన లోపం లాంటివి ఉన్నట్లు తెలుస్తున్నాయి. ఇరువు రాష్ట్రాల అధికారుల సమన్వయ లోపంతో 40 సంవత్సరాలు గా లెండిప్రాజెక్టు పూర్తి కాలేదు. దీంతో రైతులు సాగునీటి కోసం ప్రాజెక్టు పూర్తి కావాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, మహారాష్ట్రలోని నాందేడ్ ఎమ్మెల్యే లతో కలిసి చర్చించి పనులు జరిగేలా చర్యలు చేపట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు.

లెండి ప్రాజెక్టు నీటి కోసం ఎదురుచూస్తూనే ఉన్నాం

-------దశాబ్దాలుగా లేండి ప్రాజెక్టు నీటి కోసం రైతులంతా ఎదురుచూస్తూనే ఉన్నారు. మహారాష్ట్ర తెలంగాణ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో తాము పొలాల్లో పంటలు వేసుకోలేకపోతున్నామన్నాం. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో మాకు ఎప్పుడు మీరు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని ప్రాజెక్టు పూర్తి అయ్యే విధంగా చూడాలని కోరుతున్నాం.

 బాలకిషన్, రైతు, మద్నూర్

జుక్కల్ ఎమ్మెల్యే పైనే ఆశలు..

లేండి ప్రాజెక్టు నుంచి నీరు అందించే విధంగా చూస్తారని ఆశ ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తోట లక్ష్మీకాంతరావు పైనే ఆశలు ఉన్నాయి. గత ఏడాది క్రితం ఆయన సందర్శించి హామీ ఇచ్చారు. పనులు పూర్తికాలేదు అంటున్నారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని నీరు అనే విధంగా చూడాలి.

 చందర్, రైతు,  మద్నూర్