calender_icon.png 14 August, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ ‘స్పెషల్’దోపిడీ..!

14-08-2025 12:24:08 AM

-గుట్టుచప్పుడు కాకుండా చార్జీల పెంపు

-రాఖీ రద్దీ దృష్ట్యా చార్జీల బాదుడు

-స్పెషల్ బస్సుల పేరిట భారీ వసూళ్లు

-టికెట్ ధరల్లో 30 శాతం పెంపు

-నల్లగొండ జిల్లాలో రూ.9 కోట్లు అదనపు ఆదాయం

 నల్లగొండ టౌన్, ఆగస్టు 13 : పండుగొస్తే ప్రయాణికులకు అవస్థలు కల్పించడం.. స్పెషల్ బస్సుల పేరిట భారీగా క్యాష్ చేసుకోవడం టీజీఎస్‌ఆర్టీసీకి పరిపాటిగా మారింది. మహాలక్ష్మి పథకం తెచ్చినప్పటి నుంచి ప్రయాణికులపై భారీగా భారం మోపుతున్నది.

రాఖీ పర్వదినాన ఆడబిడ్డలకు సరిపోను ఉచిత బస్సు సర్వీసులను కల్పించని అదే ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో వెళ్లేలా పాచిక పన్నింది. ఆ ప్రత్యేక బస్సుల్లో ఉన్న చార్జీల కంటే సుమారు 30 శాతం వరకు అదనపు భారం మోపింది. దీంతో రాఖీ పండగకని ఇంటికి వెళ్లాలనుకుంటే అదును చూసి ఆర్టీసీ సంస్థ నిలువుదోపిడీ చేస్తున్నదని లక్షలాది మంది ఆడబిడ్డలు ఆవేదన వ్యక్తంచేశారు. 

అవాక్కైన ఆడబిడ్డలు..

బస్టాండ్లలో ఉన్న రద్దీకి భయపడి పిల్లా పాపలతో వెళ్లిన ఎందరో ఆడబిడ్డలు ఖ్చనా కూడా ప్రత్యేక బస్సుల్లో వెళ్లారు. బస్సెక్కాక అదనపు చార్జీలతో కండక్టర్లు కొట్టే టిక్కెట్లు చూసి అవాక్కవడం వారి వంతయింది. సాధారణ రోజుల్లో టికెట్ రూ.100 ఉంటే.. స్పెషల్ బస్సుల పేరుతో రూ.150 వరకు వసూలు చేశారు. రూ.200 టికెట్ ధర ఉంటే రూ.300 తీసుకున్నారు. నల్లగొండ నుంచి మిర్యాలగూడకు సాధారణ చార్జీ రూ.60 ఉండగా  రాఖీ పండుగ సందర్భంగా రూ.120కి పెంచారు.

డీలక్స్ లో రూ. 100 ఉన్న చార్జీని  రూ. 240 స్పెషల్ పేరుతో వసూలు చేశారు. ఎల్బీ నగర్ నుంచి సూర్యాపేటకు రూ.200 ఉన్న చార్జీ రూ.310కి పెంచారు.కొన్నిచోట్ల రెట్టింపు టికెట్లతో క్యాష్ చేసుకున్నారు. పెరిగిన ధరలను చూపుతూ ప్రయాణికులను ఆర్టీసీ నిలువుదోపిడీ చేస్తున్నదని సోషల్ మీడియా వేదికగా వందలాది ఈ రాఖీకి ఆర్టీసీ కోట్లల్లోనే ఆర్జిస్తుందని, మహాలక్ష్మి ఉచిత ప్రయాణం పథకం నష్టాలను పూడ్చుకునేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నదని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

రెగ్యులర్ బస్సులు ఆపి.. స్పెషల్ బస్సులు వదిలి..

రాఖీ పండుగ సందర్భంగా నల్లగొండ రీజియన్లలోని 7 బస్ డిపోలు మహిళా ప్రయాణికులతో కిటకిటలాడాయి. శుక్రవారం నుండి సోమవారం వరకు  అన్ని బస్టాండ్లలో విపరీతమైన రద్దీ కనిపించింది.  డిపోలకు ఏ బస్సు వచ్చినా చార్జీలతో సంబంధం లేకుండా సీట్ల కోసం ప్రయాణికులు ఎగబడ్డారు.

గంటల తరబడి బస్సుల కోసం వేచిచూసిన వారు.. వచ్చిన ఒక్క బస్సును అందుకోవాలని పిల్లలను వెంటేసుకొని సీట్ల కోసం పరుగెత్తారు. ఇక ఉచిత బస్సులు కంటికి కనిపించడకపోవడంతో స్పెషల్ బస్సుల్లోనే ప్రయాణాలు సాగించారు.  ఆయా డిపోల నుంచి రెగ్యులర్గా తిరిగే బస్సులను ఆపి.. వాటిల్లో కొన్నింటికి స్పెషల్ బోర్డులు తగిలించి తిప్పారని ప్రయాణికులు మండిపడ్డారు.

స్పెషల్ బస్సుల్లో 30 శాతం అదనపు వసూలు

నలగొండ ఆర్టిసి రీజియన్ పరిధిలోని ఏడు బస్సు డిపోల  రాఖీ పండగ సందర్భంగా మహిళలకు ఇబ్బందులు కలగకుండా  150 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశాం. ఇందులో భాగంగా  8,9,10,11 తేదీల్లో స్పెషల్ బస్సుల్లో   ప్రస్తుతం ఉన్న టికెట్ పై అదనంగా30 శాతం వసూలు చేశాం. స్పెషల్ బస్సుల్లో  4 రోజుల్లో 14 లక్షల మంది ప్రయాణికులు సద్వినియోగం చేసుకున్నారు. ఇందులో తొమ్మిది లక్షల మంది మహిళలు, 5 లక్షల మంది పురుషులు ఉన్నారు. ఈ స్పెషల్ బస్సుల ద్వారా రూ.9 కోట్ల ఆదాయం వచ్చింది.

  కె.జాన్ రెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం, నల్లగొండ