14-08-2025 12:00:00 AM
- ఏళ్ల తరబడి నోటిఫికేషన్ రాక ప్రజలకు ఇక్కట్లు..
- జిల్లాలో ఇప్పటికే 16 చోట్ల ఖాళీలు
- కొత్త రేషన్ కార్డులు పేర్ల సంఖ్య పెరగడంతో మరింత తిప్పలు
- తండాలో కనిపించని రేషన్ షాపులు
నిర్మల్, ఆగస్టు ౧౩ (విజయక్రాంతి): పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు ప్రతి నెల ఉచితంగా అందించి రేషన్ సరుకుల సరఫరాపై ప్రభుత్వ అధికారులు దృష్టిపెట్టకపోవ డంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రజలకు కనీస అవసరాలు నిత్యవసర వస్తువులు కూడా తప్పనిసరి కావడంతో ఇప్పటికీ జిల్లా ల్లో ఉన్న రేషన్ షాపు దుకాణాలు స్థానికంగా లేకపోవడంతో పక్క ఊర్లకు తరలివెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకుంటున్నారు.
అప్పటి తెలంగాణ ప్రభుత్వం 500 జనాభా ఉన్న ప్రతి గ్రామం తండాను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసినప్పటికీ కొత్త పంచాయతీలో రేషన్ డీలర్ల నియామక ప్రక్రియ ఇప్పటికీ చేపట్టడం లేదు. దీంతో రేషన్ సరుకులు పొందెం దుకు రేషన్ కార్డు లబ్ధిదారులు డీలర్ల వద్ద పడిగాపులు పడుతున్నారు. . కూలి నాలి చేసుకొని బతుకుతున్న పేదకుటుంబాలు రేషన్ బియ్యం పొందాలంటే ఆరోజు పనిమానుకొని ఇతర గ్రామాల నుంచి సరుకులు తెచ్చుకోవడం జరుగుతుందని అంటున్నారు.
నిర్మల్ జిల్లాలో 18 మండలాలు నిర్మల్ బైంసా ఖానాపూర్ మున్సిపాలిటీలు 400 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 412 రేషన్ దుకాణాలు ఉండగా 580 ఆవాస గ్రామాలు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. వీరందరికీ ప్రభుత్వం ప్రతినెల రేషన్ సరుకులు పంపిణీ చేయవలసిన బాధ్యత ఉన్నప్పటికీ స్థానికంగా రేషన్ షాపులు లేకపోవడంతో ఇటువంటి డీలర్లు అటు రేషన్ కార్డు లబ్ధిదారులు రేషన్ పొందేందుకు నానా అవస్థలు పడుతున్నారు
కార్డులు పెరిగిన దుకాణాలు పెరగలే..
దారిద్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల కు ప్రభుత్వం రేషన్ కార్డులను మంజూరు చేస్తుంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటికి 2.33,478 రేషన్ కార్డులు ఉండగా ప్రతినెల 7,33,913 మందికి ప్రతినెల రేషన్ సరుకులు అందిస్తున్నారు. ఇందులో వైట్ రేషన్ కార్డులుతో పాటు అంత్యోదయ అన్నపూర్ణ గులాబీ రేషన్ కార్డులు ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభు ్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసేందుకు సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాలో 33 982 మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
సర్వే అనంతరం 29 386 మంది అర్హులుగా పేర్కొంటూ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఇటీవలే పంపిణీ చేసింది. అంటే కొత్త రేషన్ కార్డుల ద్వారా 89, 308 కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసింది. వీటికి తోడు పాత రేషన్ కార్డులు పెళ్లయిన వారు పుట్టిన పిల్లల పేర్లు రేషన్ కార్డులో జాబితాలో లేనివారు అదనంగా చేర్చుకునేందుకు ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది.
48 0 68 దరఖాస్తులు రాగా 44 386 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ అనంతరం కొత్త జాబితాల పేర్లను రేషన్ కార్డులో అదనంగా జోడించారు దీని ద్వారా 63 596 మంది పాత రేషన్ కార్డులు కొత్త పేర్లను జాబితాలో చేర్చడంతో జిల్లాలో రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వం రేషన్ కార్డులు రేషన్ కార్డు జాబితాలో అదనపు పేర్లను చేసినప్పటికీ రేషన్ కొత్త దుకాణాల ఏర్పాటు పై ప్రభుత్వం ఇప్పటికి ఒక నిర్ణయం తీసుకోకపోవడంతో రేషన్ సరుకుల పంపిణీకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని రేషన్ డీలర్లు వాపోతున్నారు.
రేషన్ షాపులు పెంచితేనే ప్రయోజనం
జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డులు లబ్ధిదారుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో కొత్త రేషన్ షాపులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని రేషన్ డీలర్లు పేర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా 10 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన రేషన్ షాపులు మాత్రమే ఇప్పటికి నిర్వహణ చేస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక రేషన్ షాపు పట్టణాల్లో ప్రతి వార్డు ఒక రేషన్ షాపు ఏర్పాటు చేయాలి. 500 రేషన్ కార్డులు దాటినచోట అదనపు రేషన్ షాపులను ఏర్పాటు చేస్తే సరుకులను సులభతరంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు.
కొత్త తండాలో అనుబంధ గ్రామాల్లో రేషన్ షాపు లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. రేషన్ సరుకులను పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం జిల్లా పౌరసరఫరాల శాఖ పారదర్శక సేవలను అందు బాటులోకి తీసుకువచ్చింది.
వేలిముద్రలు ఐరిష్ విధానంతో పోల్టి బెటర్ ద్వారా ఎక్కడై నా రేషన్ సరుకులు పొందెందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే చాలా గ్రామాల్లో రేషన్ షాపులు నిర్వహిస్తున్న వారు ఒకటి నుంచి పది వరకు దేశ సరుకులను పంపిణీ చేస్తున్నప్పటికీ కొన్ని గ్రామాల్లో సమయపాలన పాటించకపోవడంతో ఉదయం పూట రేషన్ అందక పడిగాపులు పడవలసి వస్తుందని రేషన్ కార్డు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం వర్షాకాల సీజన్ నేపథ్యంలో నెలరోజుల క్రితమే మూడు నెలల రేషన్ సరుకులను ఒకేసారి పంపిణీ చేయగా సెప్టెంబర్ 1 నుంచి కొత్త రేషన్ కార్డులకు కూడా సరుకులు అందించవలసిన బాధ్యత ఉండడంతో రేషన్ పంపిణీ ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వం ఇప్పటినుండి దృష్టి పెట్టాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రేషన్ షాప్ లతోపాటు కొత్త రేషన్ షాపుల అనుమతికి ప్రభుత్వం వెంట నే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం ఏ మేరకు చర్యలు చేపడు తుందో వేచి చూడాల్సిందే.
సమస్యలు పరిష్కరించండి
ప్రభుత్వం రేషన్ కార్డుల సంఖ్య లబ్ధిదారుల సంఖ్య పెంచినప్పటికీ రేషన్ దుకాణాలను పెంచకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది. రేషన్ సరుకులను సాంకేతిక పరిజ్ఞానంతో సరఫరా అందించడం వల్ల మార్పుల గ్రామాల్లో సిగ్నల్ లేక రేషన్ డీలర్లు ఇబ్బంది పడుతున్నా రు. అన్ని గ్రామ పంచాయతీలో రేషన్ షాపులను ఏర్పాటు చేసి రేషన్ డీలర్లకు కమిషన్ను పెంచాలి పెంచాలని గౌరవ వేతనం చెల్లించాలి. ప్రతి నెల కమిషన్ రేషన్ డీలర్ల ఖాతాలో జమ చేసేలా చర్య తీసుకోవాలి ఎన్నో ఏళ్లుగా కోరుతున్నాం ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నాం.
అనంతుల రాజేందర్, రేషన్ డీలర్