29-09-2025 01:13:04 AM
శరన్నవరాత్రి ఉత్సవ పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్
ఆదిలాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): హిందువుల జరుపుకునే పండగలన్నీ దైవభక్తిని పెంపొందించేలా ఉంటాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. వైశ్య రక్షక్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏటా చేపట్టే ఛలో శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ముందుగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరీ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కన్యకా పరమేశ్వరీ ఆలయం నుండి పట్టణ శివారులోని శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయం వరకు చేపట్టే పాదయాత్రను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. కాషాయ జెండాలను చేతపట్టుకుని పెద్దఎత్తున భక్తులు పాదయాత్రలో పాల్గొనగా, భక్తులు చేసిన జై మాతాజీ నినాదాలతో పట్టణ ప్రధాన వీధులు మారుమ్రోగాయి.
ఈ కార్యక్రమంలో హిందూ సమాజ ఉత్సవ సమితి అధ్యక్షులు బొంపెల్లి హన్మాండ్లు, ప్రధాన కార్యదర్శి రాళ్లబండి మహేందర్, సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి తో పాటు ఆర్యవైశ్య సంఘం నాయకులు కొత్త రాజేశ్వర్, బీజేపీ నాయకులు లాలా మున్న, రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.