22-09-2025 12:33:31 AM
మొదటిరోజు శైలపుత్రి దేవిగా దర్శనం
నవ రూపాల్లో దర్శనమివ్వనున్న అమ్మవారు
రాష్ట్రం నలుమూలల నుంచి తరలిరానున్న భక్తులు
ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
అలంపూర్, సెప్టెంబర్ 21:రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠం కలిగిన ప్రముఖ ఐదవ శక్తిపీఠం అలంపురం శ్రీ జోగుళాంబ అమ్మవారి దేవస్థానం నందు శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి అక్టోబర్ 2 వరకు అత్యంత వైభవంగా నిర్వహిం చనున్నట్లు ఆలయ ఈవో దీప్తి , కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఈ బ్రహ్మోత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తు లు అధిక సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. చలువ పందిళ్లు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. గోపురాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.భక్తులకు మంచి నీటి వసతిని ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు వివరించారు.
వివిధ రూపాల్లో అమ్మవారి అలంకరణ
జోగుళాంబ అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగం గా నవదుర్గా అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మొదటిరోజు సోమవారం శైలపుత్రి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
23న బ్రహ్మచారిణి దేవి, 24న చంద్రఘంటదేవి, 25న కూస్మాండా దేవి ,26న స్కంద మాతాదేవి, 27న కాత్యాయనిదేవి ,28న కాళరాత్రిదేవి ,29న మహా గౌరీ దేవి ,30న సిద్ధిధాత్రి దేవిగా రోజు ఒక రూ పంలో అలంకరించి ఆరాధిస్తారు. అక్టోబర్ 1న జోగుళాంబ దేవి అలంకరాల్లో అమ్మవారు దర్శనమివ్వనున్నారు.
ప్రత్యేక అర్జిత సేవలు..
దేవి నవరాత్రులలో ఆలయంలో ప్రత్యేక అర్జిత సేవలు నిర్వహిస్తారు.నిర్ణీత రుసుము చెల్లించి ఈ పూజలో పాల్గొనవచ్చు.ఉదయం 7:30 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సహస్ర నామార్చన, ఉదయం 9 గంటలకు శ్రీ చక్ర నవావరణ అర్చన,
ఉదయం 8 నుంచి 11:30 వరకు కుంకుమార్చన మండపంలో త్రిశతి అర్చన, ఉదయం 10 చండీ హోమము ,మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు ఖడ్గమాల అర్చ న, 6:30 గంటలకు రథోత్సవం ,సాయంత్రం ఏడు గంటలకు కొలువు పూజ ,(దర్బారు సేవ) సుహాసిని కుమారి పూజలు ఉంటాయి. మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 వరకు ఉచిత సామూహిక కుంకుమార్చన ఉంటుంది.
గద్వాల్ సంస్థానము వంశీయులు చీరలు బహుకరణ
దసరా శరన్నవరాత్రి ఉత్సవంలో సందర్భంగా గద్వాల సం స్థానముకు చెందిన వంశీయులు శ్రీ జోగుళాంబ అమ్మవారికి తొమ్మిది రోజులపాటు అలంకరించుటకు 9 చీరలను బహుకరించినట్లు ఆలయ ఈవో దీప్తి తెలిపారు.