calender_icon.png 15 July, 2025 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాస్టల్ భవనం పైనుంచి దూకి ఐదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

15-07-2025 12:00:00 AM

  1. యాదాద్రి జిల్లా తూప్రాన్‌పేట బీసీ గురుకులంలో ఘటన 
  2. నస్పూర్‌లో బిల్డింగ్ పైనుంచి దూకి మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం 

చౌటుప్పల్/నస్పూర్ (మంచిర్యాల), జూలై 14: హాస్టల్ భవనం పైనుంచి దూకి ఐదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట గ్రామంలోని మహాత్మ జ్యోతిరావుఫూలే బీసీ సంక్షేమ గురుకులంలో సోమవారం జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా విట్టలపురం గ్రామానికి చెందిన విద్యార్థిని సంధ్య తూప్రాన్‌పేట గురుకులంలో ఈ ఏడాదే ఐదో తరగతిలో చేరింది.

వారం రోజుల క్రితం ఇంటికి వెళ్లి తనకు హాస్టల్‌లో చదవడం ఇష్టం లేదని చెప్పింది. అయినా తల్లిదండ్రులు బలవంతంగా ఆదివారం హాస్టల్‌కు పంపించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నాలుగు అంతస్తుల హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

కేజీబీవీ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం 

మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థిని హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య యత్నానికి యత్నించిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. దండేపల్లి మండలం వెల్గనూరు గ్రామానికి చెందిన ఎర్రవేణి నరేష్, జ్యోతి దంపతుల కూతురు మధులిఖిత నస్పూర్ కేజీబీవీలో తొమ్మిదో తరగతిలో అడ్మిషన్ పొందింది. హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక సోమవారం పాఠశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో ఆమె రెండు కాళ్లు విరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది.