calender_icon.png 24 January, 2026 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాలయంలో సినీ హీరో సుమన్ పూజలు

24-01-2026 12:23:24 AM

శంకర్‌పల్లి, జనవరి 23( విజయక్రాంతి): శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామంలో వెలసిన 11వ శతాబ్దపు పురాతన, మహిమాన్విత బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని ప్రముఖ సినీ హీరో సుమన్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న సుమన్కు అర్చకులు సాయిశివ, ప్రమోద్ ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ ధర్మకర్త వీడియోరావు, ప్రచార కమిటీ చైర్మన్ దయాకర రాజు స్వామి మరియు ఇతర కమిటీ సభ్యులు సుమన్ను శేష వస్త్రంతో సన్మానించి, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.ఆలయ ప్రాంగణంలోని కాలభైరవుడి సన్నిధిలో ఉన్న, కోరిన కోరికలు తీర్చే రాయి (వింత రాయి)ని సుమన్ భక్తితో పట్టుకోగా, అది కుడివైపుకు తిరగడం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది.

మరోసారి కుటుంబంతో వస్తాను: సుమన్

దర్శనం అనంతరం సుమన్ మాట్లాడుతూ ఇంతటి పురాతన మరియు ప్రశాంతమైన శివాలయాన్ని దర్శించుకోవడం ఎంతో అనుభూతినిచ్చింది. త్వరలోనే మళ్ళీ సమయం చూసుకొని కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి స్వామివారిని దర్శించుకుంటానని ఆయన పేర్కొన్నారు. పూజల అనంతరం సుమన్ అన్నదాన సత్రంలో ఆలయ నిర్వాహకులతో కలిసి భోజనం చేశారు. అభిమానులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్కు ప్రయాణమయ్యారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ శేఖర్, గౌరవాధ్యక్షుడు సదానందం గౌడ్, అన్నదాన చైర్మన్ దర్శన్ గౌడ్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.