calender_icon.png 8 July, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేస్తా: మాళవిక మనోజ్

07-07-2025 08:32:37 PM

కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకత్వంలో వీ ఆర్ట్స్ పతాకం(V Arts Banner)పై హరీశ్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న ఈ సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకి మాళవిక మనోజ్ సోమవారం పాత్రికేయులతో ముచ్చటించింది. 

నేను తమిళంలో నటించిన చిత్రం ‘జో’లో నా అభినయం చూసి దర్శకుడు రామ్ ఈ సినిమాకు హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నాడు. కథ వినగానే ఎంతో నచ్చింది. అందులో నాకు నచ్చిన అంశాల గురించి ఒక్క వాక్యంలో చెప్పడం కష్టం. చాలా విభిన్నంగా అనిపించింది. 

గతంలో సాధారణ గ్రామీణ అమ్మాయిగా చేశా. ఇందులో ఎంతో మోడ్రన్‌గా, హైపర్‌గా, ఆటిట్యూడ్‌తో ఉంటుంది. ప్రతి నటి కోరుకునే వైవిధ్యమైన పాత్ర ఇది. నా పాత్ర పేరు సత్యభామ. నా వ్యక్తిగత జీవితానికి ఎలాంటి పోలిక లేనిదీ సత్యభామ పాత్ర. 

తెలుగులో నటించడం చాలా ఆనందం అనిపించింది. అన్ని భాషల మాదిరిగానే ఇక్కడ కూడా సౌకర్యంగానే అనిపించింది. ఇక్కడి టెక్నిషియన్స్, ఆర్టిస్టుల్లో ఎంతో ప్రొఫెజనలిజం ఉందని గమనించా. తెలుగు అర్థమవుతుంది. తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయినా సినిమాలు చూస్తుంటా. ఇటీవల తెలుగు ‘హిట్-3’ చూశా. తెలుగు రాకపోయినా, భావం అర్థం చేసుకుని నటించా. చిత్రీకరణ సమయంలో తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నా. 

ఈ సినిమా కోసం ఎలాంటి వర్క్‌పాప్, హోమ్‌వర్క్  చేయలేదు. నాకు ఈత కొట్టడం రాకపోయినా, షూటింగ్ వాయిదా పడటం ఇష్టంలేక ఓ సన్నివేశంలో స్విమింగ్ చేశాను. ఎంతో భయమేసింది. ఎప్పుడూ, విభిన్నంగా, సవాల్ విసిరే పాత్రలే చేయాలని ఉంటుంది. ఎందుకంటే, రొటీన్ పాత్రలే చేస్తుంటే.. నాకే కాదు ప్రేక్షకులకూ బోర్ కొడుతుంది. అందుకే నన్ను నేను వైవిధ్యమైన పాత్రల్లో చూసుకోవడమే నాకిష్టం. 

సుహాస్ గతంలో నటించిన ‘కలర్‌ఫోటో’, ‘హిట్-2’ చూశా. ఆయన వెరీ నైస్ పర్సన్. ఎంతో హార్డ్‌వర్క్ చేస్తాడు. సెట్‌లో సినిమా కోసమే మాట్లాడతాడు. పెద్ద టాకింగ్ పర్సన్ కాదు.   

సినిమా నేపథ్యంతో సంబంధం లేని కుటుంబం నాది. ఫ్యామిలీ సపోర్ట్‌తోనే  నటిస్తున్నా. మొదట్లో మా బంధువులంతా భయపడ్డారు. నాకు మాత్రం ఎలాంటి భయంలేదు.. గర్వంగా ఉంది. ఇప్పుడు ట్రైలర్ చూసి మా ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు. 

నాకు చాలా ఆఫర్లు వచ్చాయి.. నచ్చిన కథలకే ఓకే చెప్తున్నా. నా కంఫర్ట్ జోన్‌లో సినిమాలు చేస్తున్నా. అయితే, గ్లామరస్ రోల్స్ చేయాలా.. వద్దా? అనే నిబంధనేమీ లేదు నాకు.. నచ్చని పాత్రలు చేయనంతే!