calender_icon.png 7 September, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్ తుదిజాబితా విడుదల

02-09-2025 12:00:00 AM

-అసెంబ్లీ ఓటర్ జాబితాలోనే స్వల్ప మార్పులు

-ఓటర్ జాబితాపై భారీగా ఫిర్యాదుల వెల్లువ 

-మొత్తం 3624 ఫిర్యాదులు 

-ఆర్డీవో ఆధ్వర్యంలో దిద్దుబాటు చర్యలు 

 రంగారెడ్డి సెప్టెంబర్ 1( విజయ క్రాంతి ): స్థానిక ఎన్నికల కోలహాలం జిల్లాలో  మొదలైంది.ఎన్నికల నిర్వహణపై ఈసీ నోటిఫికేషన్ జారీ చేయడంతో అధికారులు ఆ దిశగా కసరత్తులు ప్రారంభించారు. ఈసీ షెడ్యూల్ అనుసరించి జిల్లా,డివిజన్ మండల స్థాయిలో ఇప్పటికే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో జిల్లా, మండల స్థాయి అధికారులు సమావేశం నిర్వహించారు. దీంతో జిల్లా స్థాయి మొదలుకొని గ్రామస్థాయి వరకు అధికారులు అంతా ఎన్నికల నిర్వహణలో నిమగ్నమయ్యారు. ఈసీ నిబంధనల ప్రకారం పంచాయతీల వారీగా  జీపీ లో ప్రదర్శించిన ఓటర్ జాబితా పై సదర్ నేతల అభిప్రాయాలను ఫిర్యాదులను స్వీకరించారు.

అయితే అసెంబ్లీ ఓటరు జాబితాలోనే స్వల్ప మార్పులు చేసి అధికారులు తుది జాబితాను విడుదల చేయడంతో ఆయా రాజకీయ పార్టీల నేతలు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలాలు, గ్రామాలు వార్డులు వారిగా  తమ దృష్టికి వచ్చిన తప్పొప్పులను గుర్తించి  అధికారులకు ఓటరు జాబితా పై ఫిర్యాదులు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన  రాజకీయ పార్టీల సమావేశంలో ఆదిభట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి  తనకు మూడు ప్రాంతాల్లో ఓటరు జాబితాలో పేర్లు ఉన్నాయని  ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం, మంచాలో రెండు స్థానాల్లో ఓటును తొలగించాలని... ఇలా ఓటర్ జాబితాలో  పలు తప్పులు దొర్లాయని ఆయన అడిషనల్ కలెక్టర్ కి సమస్యను విన్నవించారు.

ఇలా చెప్పుకుంటూ పోతే గ్రామ, మండల స్థాయిలో ఓటర్ జాబితాలో భారీగా తప్పులు దొర్లాయని,పేర్లు, ఫోటోలు పూర్తిగా తప్పులు తడకగా ఉన్నాయని.... ఒకే ఫ్యామిలీకి సంబంధించిన ఓటర్లు వేర్వేరు వార్డుల్లో దర్శనమిచ్చాయని పేర్లు కూడా మిస్టేక్లు ఉన్నాయని,గ్రామంలో చనిపోయిన  వారి ఓట్లు కూడా లిస్టులో పేర్లు ఉండటం అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. జిల్లాలలో మొత్తం 3,624 లు ఫిర్యాదులు రాగా 37 ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులపై ఫిర్యాదులు అధికారులకు అందాయి. అందులో అత్యధికంగా మహేశ్వరం నుంచి 265 ఫిర్యాదులు రాగా అత్యల్పంగా కొత్తూరు మండలం నుంచి 66 వచ్చాయి.

ఓటర్ జాబితా పై వచ్చిన ఫిర్యాదుల గురించి జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ ను వివరణ కోరగా వాస్తవంగా కొన్ని తప్పులు దొర్లాయని అయితే ఓటర్ జాబితా పై వచ్చిన ఫిర్యాదులు వాటి సవరణ మా పరిధి కాదని ఆర్డిఓ ఆధ్వర్యంలో ఓటర్ జాబితా పరిశీలన కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఇప్పటికే వచ్చిన ఫిర్యాదులపై ఆర్డీవోకు నివేదించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయా మండలాల వారిగా ఓటర్ జాబితా పై వచ్చిన ఫిర్యాదులను ఆర్డీవో సమక్షంలో  అధికారులు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. రేపు వార్డులు గ్రామం మండలాల వారిగా ఓటర్ తుది జాబితాను అధికారులు ప్రదర్శించనున్నారు. రెండు రోజుల క్రితం ఎంపీటీసీ, జెడ్పీటీల ముసాయిదా జాబితాను కూడా ఈసీ విడుదల చేసింది. ఈనెల 6న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటన 8న అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం అభ్యంతరాల స్వీకరణ 10 ఓటర్ల తుది జాబితా ప్రకటన చేయనున్నట్లు ముసాయిదా జాబితాలో పేర్కొన్నారు.

జిల్లాలో తగ్గిన సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలు

జిల్లాలో గతంతో పోల్చుకుంటే భారీగా సర్పంచ్ ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. జిల్లాలో మొత్తం 27 మండలాలు ఉండగా అందులో 15 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. 21 మండలలో సింహ భాగం గ్రామీణ మండలాలు కాగా, 6 మండలాలు పూర్తిగా అర్బన్ మండలాలుగా అధి కారులు గుర్తించారు. మహేశ్వరం, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, ఎల్బీనగర్ నియోజక వర్గంలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ సమీపంలోని గ్రామాలను ఇటీవల మున్సిపాలిటీలో విలీనం చేసింది. చేవెళ్ల, మొయి నాబాద్ మండలాలు లను నూతన మున్సిపాలిటీలు గా ఏర్పాటు  చేసింది.

21 మండలాల్లో ...

  - 526 గ్రామపంచాయతీలు

- 230 ఎంపీటీసీలు,

- 21 జడ్పిటిసిలు

- 4,668 వార్డులు

- 4,682 పోలింగ్ కేంద్రాలు

- మొత్తం ఓటర్లు: 7,94,653

- పురుషులు :3,99,404

- మహిళలు : 3,95,216

- ఇద్దరు ఓటర్లు :33