18-11-2025 12:18:20 AM
-న్యూఢిల్లీలో అప్పగించిన చైర్మన్ అరవింద్, సభ్యుల బృందం
-రాష్ట్రాలకు గ్రాంట్ల కేటాయింపుల సిఫార్సులపై ఉత్కంఠ
-గత ఆర్థిక సంఘం 41% సిఫార్సు చేయగా.. రాష్ట్రాల పెదవి విరుపు
-ఈసారి 50%కి పంచాలని రాష్ట్రప్రభుత్వాల డిమాండ్
-త్వరలో స్పష్టతనివ్వనున్న కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ, నవంబర్ 17: 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగరి యా నేతృత్వంలో బృందం సోమవారం తన నివేదికను దేశ రాజధాని న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసి సమర్పించింది. ఆర్థిక సంఘం ఈ నివేదికలో 2026 31 మధ్య రాష్ట్రాల నుంచి కేంద్రానికి పన్నుల ద్వారా వెళ్లే ఆదాయం, కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్ల (నిధుల కేటాయింపు) అంచనాలను ప్రతిపాదించింది.
15వ ఆర్థిక సంఘం కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే వాటా 41శా తం ఉండాలని సిఫార్సు చేసింది. 15వ ఆర్థిక సంఘం 2021 -26 వరకు ఐదేళ్లకు రాష్ట్రాలకు 41 శాతం గ్రాంట్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది. దీనిలో భాగంగా 2025 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఆర్జించిన రూ.42.70 లక్షల కోట్లలో, 41శాతం అంటే రూ.14.22 లక్షల కోట్లను రాష్ట్రప్రభుత్వాలకు అందించాల్సి ఉంది. ఈ నిధుల కోసం ఆయా రాష్ట్రప్రభుత్వాలు ఎదురుచూస్తున్నాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈ నివేదిక ఆధారంగా గ్రాంట్ల కేటాయింపుల అంశాన్ని తేల్చనుంది.
రాష్ట్రాల గ్రాంట్లు 50శాతానికి పెంచాలని డిమాండ్
మరోవైపు అనేక రాష్ట్రప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంఘం గ్రాంట్లను 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 16వ ఆర్థిక సంఘం తన నివేదికలో ఎంత ప్రతిపాదించింది.. ఈసారైనా కేటాయింపులు పెరుగుతాయా .. లేదా అన్న అంశాలైతే ఇప్పటివరకు బయటకు రాలేదు. సంఘం అందుకు ఒక్కో రాష్ట్ర జనాభా, అక్కడి భౌగోళిక పరిస్థితులు, అటవీ విస్తీర్ణం, ఆదాయం, అభివృద్ధి.. తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంది.
గ్రాంట్ల కేటాయింపుల్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగుతున్నదని గతకొన్నేళ్ల నుంచి ఈ ప్రాంతానికి చెందిన పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. సంఘం ఈ అంశంపైనా అధ్యయనం చేసి, రాష్ట్రాలకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుందని తెలిసింది. తద్వారా రాష్ట్రాలకు వచ్చే ఆదాయ లోటును భర్తీ చేసేందుకు సిఫార్సులు చేయనుంది. అలాగే కొన్నిరాష్ట్రాలు తరచూ ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటున్నాయి. ఆయా రాష్ట్రాలకు విపత్తుల నిర్వహణ సంస్థ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫండ్స్) కేటాయింపుల పైనా కమిషన్ సమీక్షించింది.
మొత్తానికి ఈ సిఫార్సులు దేశంలోని పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయి. ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గ్రాంట్లు విడుదల చేయనుంది. తద్వారా దేశ సంక్షేమం, విద్యారంగ అభివృద్ధి, వైద్యారోగ్యశాఖ బలోపేతం, గ్రామీణాభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుంది. 16వ ఆర్థిక సంఘం సభ్యులుగా వివిధ రంగాల్లో సుదీర్ఘకాలం పాటు ఆర్థిక నిపుణులుగా పనిచేసిన అనీజార్జ్ మాథ్యూ, మనోజ్ పాండా, సౌమ్యకాంతి ఘోష్, రబీ శంక తదితరులు కొనసాగుతున్నారు.