29-08-2025 12:35:26 AM
వచ్చేనెల నుంచి పంపిణీ చేయనున్న సర్కార్
6.10 లక్షల కొత్త రేషన్‌కార్డుదారులకు లబ్ధి
హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): తెల్లరేషన్ కార్డుదారులకు ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. సెప్టెంబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు కూడా సన్నబియ్యం పంపిణి చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించగా లక్షలాదిగా అర్జీ పెట్టుకున్నారు. అన్ని రకాల వడపోతల అనంతరం ప్రభుత్వం 6.10 లక్షల మందికి కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసింది.
వీరికి వచ్చే నెల నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే 89.90 లక్షల వరకు పాత కార్డులు ఉండగా, ఇప్పుడు కొత్త కార్డులతో కలిపి మొత్తం 96 లక్షల వరకు చేరాయి. లబ్ధిదారుల సంఖ్య సైతం 3.12 కోట్లకు చేరింది. రేషన్‌కార్డులో పేరున్న ప్రతి లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున ప్రభుత్వం బియ్యం పంపిణీ చేయనుంది. ఇలా మొత్తం ప్రతినెల 2.10 లక్షల టన్నుల బియ్యం రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం సరఫరా చేయనుంది.
కిలో బియ్యం ధర రూ.40 కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా రూ.10,665 కోట్ల వరకు భారం పడుతుంది. సన్న బియ్యం పంపిణీ ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.2,800 కోట్ల అదనపు భారం పడనుంది. ఇక వచ్చే నెల నుంచి బియ్యం కోసం రేషన్ షాపు దగ్గరకు లబ్ధిదారులకు సంచుల్లో బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో బ్యాగులో 6 కిలోల చొప్పున సరఫరా చేయనున్నారు. వీటిపై సీఎం రేవంత్‌రెడ్డి, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫోటోలను ఉంటాయి.