17-10-2025 12:41:40 AM
407 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, వీవీప్యాట్ల కేటాయింపు
జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్
హైదరాబాద్, సిటీ బ్యూరో అక్టోబర్ 16 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టం పూర్తయింది. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా, పోలింగ్ కోసం ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు ,ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్ మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను గురువారం పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, జీహెఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పర్యవేక్షణలో, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.
ఈ ర్యాండమైజేషన్ ద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాల కోసం మొత్తం 569 బ్యాలెట్ యూనిట్లు, 569 కంట్రోల్ యూనిట్లు, 610 వీవీప్యాట్‌లను కేటాయించారు. ర్యాండమైజేషన్ అనంతరం వాటిని నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్‌లలో కట్టుదిట్టమైన భద్రత మధ్య భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ఖరారైన అనంతరం రెండో దశ ర్యాండమైజేషన్ నిర్వహించి, కేటాయింపు వివరాలను అభ్యర్థులకు అందజేస్తామని ఆర్వీ కర్ణన్ వెల్లడించారు.
జూబ్లీహిల్స్‌లో పోలింగ్ కేంద్రాల తనిఖీ
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రక్రియను సజావుగా, ఓటర్లకు అనుకూలంగా నిర్వహించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాన్ని, అలాగే దక్ష స్కూల్, మహాత్మా గాంధీ మెమోరియల్ హైస్కూల్, యూసుఫ్‌గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. నియోజకవర్గంలోని మొత్తం 407 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు కనీస సౌకర్యాలను కల్పించాలని ఎన్నికల, జీహెఎంసీ సిబ్బందిని ఆదేశించారు.