calender_icon.png 23 August, 2025 | 8:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహారాష్ర్ట వరదల్లో ఐదుగురు జగిత్యాలవాసుల గల్లంతు

19-08-2025 01:50:49 AM

-ప్రాణాలతో బయట పడిన ఇద్దరు

 జగిత్యాల అర్బన్, ఆగస్టు 18(విజయ క్రాంతి): మహారాష్ర్టలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆదివారం రాత్రి జగిత్యాలవాసులు గల్లంతయ్యారు. నాందేడ్ జిల్లా ముఖేడ్ సమీపంలో జగిత్యాలకు చెందిన ముగ్గురు మహిళలు, ఒక యువకుడితో సహా కారు డ్రైవర్ వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. వివరాలు .. జగిత్యాల పట్టణంలోని టీఆర్ నగర్ కు చెందిన షేక్ ఆఫ్రిన్(37), షేక్ హసీనా(30), షేక్ సమీనా(55) ఆర్మూర్ కు చెందిన షోయబ్ (21) లు కలిసి శనివారం ఉదయం మహారాష్ర్టలోని ఉద్గిర్ ప్రాంతంలో బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి ఆదివారం రాత్రి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. అయితే నాందేడ్ జిల్లా ముఖెడ్ వద్ద వాగు దాటుతుండగా వరద నీరు ఉధృతంగా ఉండడంతో కారు అదుపు తప్పి అందులో ఉన్న వారు కొట్టుకుపోయారు.

తాజాగా అందిన సమాచారం ప్రకారం షోయబ్ అనే యువకుడు , మహారాష్ర్టకు చెందిన కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారని తెలుస్తోంది. వారిని నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకా దెగ్లూరు నుంచి 30 కి.మీ దూరంలో కనుగొన్నట్లు సమాచారం. మిగిలిన వారి ఆచూకీ కోసం అక్కడి రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొన సాగిస్తున్నట్లు తెలిసింది. కాగా వరదలో కొట్టుకుపోతున్న సమయంలో అర్ధరాత్రి 12 గంటలకు ఆఫ్రిన్ తన భర్త సలీంకు ఫోన్ చేసినట్లు తెలిసింది. తాము వరదలో చిక్కుకున్నామని, బయటపడే పరిస్థితి కనిపించడం లేదని, పిల్లలను బాగా చూసుకోవాలంటూ తనతో మాట్లాడినట్లు ఆమె భర్త సలీం కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తెలిపాడు.