02-09-2025 12:00:00 AM
జీవో 49ను రద్దు చేసి పోడు రైతులకు న్యాయం చేయాలి..
మీడియా పాయింట్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31 (విజయక్రాంతి): ఇటీవల గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సంభవించిన వరదల వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు.
సోయా, పత్తి, వరి పంటలు పూర్తిగా నాశనమయ్యాయని.. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. సోయా పంటకు ఎకరానికి రూ.50 వేలు, పత్తికి రూ.40 వేలు, వరికి రూ.35 వేలు చొప్పున తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.
మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నాం: సూర్యనారాయణ
బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లకు తమ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని, అయితే మతపరమైన రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన 42 శాతం రిజర్వేషన్లు కేవలం బీసీలకు మాత్రమే దక్కాలని కోరారు. అందులో ముస్లింలను చేర్చడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు. 10 % ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే, అందుకు బదులుగా వక్ఫ్ బోర్డు ఆస్తులను హిందువులకు పంచుతారా? అని ఆయన ప్రశ్నించారు.
జీవో 49ని రద్దు చేయాలి: పాల్వాయి హరీశ్‌బాబు
బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు పోడు రైతుల సమస్యలను ప్రస్తావించారు. ‘గతంలో కేసీఆర్ ప్రభుత్వం పోడు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. దాని ఫలితంగానే శంకరగిరి మాన్యాలు పట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడిస్తే, వారికి కూడా అదే గతి పడుతుంది’ అని హెచ్చరించారు. పోడు రైతులకు అన్యాయం చేస్తున్న జీవో 49ని తక్షణమే రద్దు చేసి, వారికి న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.