01-09-2025 02:04:03 AM
విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే నాయిని
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లక్ష కోట్ల అవినీతి బయటపడుతుందనే భయంతోనే, సభలో చర్చను పక్కదారి పట్టించేందుకు ‘యూరియా కొరత’ పేరుతో బీఆర్‌ఎస్ కొత్త డ్రామాకు తెరలేపిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కామధేనువుగా వాడుకున్నారు. రూ.30 వేల కోట్ల బడ్జెట్‌తో ప్రారంభించిన ప్రాజెక్టును లక్ష కోట్లకు పెంచి దోచుకున్నారు.
కాళేశ్వరంపై చర్చ జరగకుండా ఉండేందుకే కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు” అని ఆరోపించారు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ధర్నా చేయాలి’ అని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. కాళేశ్వరం దోపిడీ వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని బీఆర్‌ఎస్ భయపడుతోందన్నారు. ఇద్దరు, ముగ్గురు కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రాన్ని దోచుకొన్నారని ఆరోపించారు.